05/1/19 11:53 AM

మర్రి శ్రీనివాస్ రెడ్డి.. నరరూప రాక్షసుడిగా, సైకో కిల్లర్‌గా మారడానికి కారణం ఇదే

Hazipur Serial Killer Marri Srinivas Reddy Criminal History

వాడు మనిషి కాదు నరరూప రాక్షసుడు. వాడు మనిషి రూపంలో ఉన్న మద మృగం, కిరాతకుడు, నర హంతకుడు, సైకో కిల్లర్. వాడే మర్రి శ్రీనివాస్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హాజీపూర్ మర్డర్ కేసుల్లో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ముగ్గురు మైనర్లను అత్యాచారం చేసి అతికిరాతకంగా చంపి పాడుబడ్డ వ్యవసాయ బావిలో పూడ్చిపెట్టిన వైనం ఉలిక్కిపడేలా చేసింది. ఈ దారుణాలకు ఒడిగట్టింది శ్రీనివాస్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో ముగ్గురు మైనర్లను చెరబట్టి చంపిన దుర్మార్గుడు. విపరీత మానసిక ప్రవర్తనతో మూడు కుటుంబాల్లో కడుపుకోత మిగిల్చిన రాక్షసుడు.. అతని దుర్మార్గాల చిట్టా బయటికొచ్చింది. యదాద్రి భువనగిరి జిల్లాలోనేకాకుండా కర్నూలు జిల్లాలోనూ అతడు దురాఘతాలకు పాల్పడ్డాడని, అతనిపై నాలుగు హత్య కేసులు ఉన్నాయని తేలింది.

 

రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌.. మర్రి శ్రీనివాస్ రెడ్డి పాపాల చిట్టాను బయటపెట్టారు. టెన్త్ క్లాస్ విద్యార్థిని శ్రావణి, డిగ్రీ విద్యార్థి మనీషా, 6వ తరగతి బాలిక కల్పనను శ్రీనివాస్ రెడ్డి అత్యాచారం చేసి చంపాడని పోలీసులు చెప్పారు. శ్రీనివాస్ ఇలా సైకో కిల్లర్ గా మారడానికి, అమ్మాయిలను టార్గెట్ చేసి చంపడానికి కారణం ఏంటో కూడా పోలీసులు తెలిపారు. శ్రీనివాసరెడ్డి 2015లో బొమ్మలరామారంలో ఓ యువతిపై అత్యాచారం చేశాడని, దాంతో అక్కడి జనం వాడిని చెట్టుకు కట్టేసి కొట్టారని, అప్పటి నుంచి వాడు మరింత ఉన్మాదంగా మారిపోయాడని పోలీసులు వివరించారు. ఆడవాళ్లపై కక్ష పెంచుకున్న శ్రీనివాస్ రెడ్డి.. వారిపై ప్రతీకారంతో ఈ దురాఘతాలకు పాల్పడినట్టు పోలీసులు వివరించారు.

 

శ్రీనివాస్ రెడ్డి నేరచరిత్రను పోలీసులు బయటపెట్టారు. గతంలో అతడిపై నమోదైన కేసులు తెలిపారు. 2017లో కర్నూలులో ఓ సెక్స్‌ వర్కర్‌ హత్య కేసులో జైలుకెళ్లాడని చెప్పారు. డ్రగ్స్, మద్యం అలవాటు కూడా ఉందన్నారు. శ్రావణి హత్య తర్వాత రావిర్యాల గ్రామంలోని బంధువుల ఇంట్లో దాక్కున్నాడని, పక్కా సమాచారంతో పట్టుకున్నామని వివరించారు.

 

పెళ్లి కాకపోవడం, మానసిక ఒత్తిడి, మనుషులపై ద్వేషం.. ఆడపిల్లలపై కామం.. మంచిమాటలు చెప్పేవారు లేకపోవడంతో ఇష్టారాజ్యం.. వెరసి మర్రి శ్రీనివాస్ రెడ్డి సైకో కిల్లర్ గా మారాడు. హాజీపూర్‌కు చెందిన శ్రీనివాస రెడ్డి కుటుంబానికి భూములు ఉన్నాయి. కుటుంబ తగాదాలతో అతుడు కొన్నేళ్లుగా లిఫ్ట్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు ప్రకారం.. అతనికి 30 ఏళ్లు దాటుతున్నా పెళ్లికాలేదు. దీంతో మానసిక ఆందోళనకు గురై విపరీతంగా ప్రవర్తిస్తున్నాడు. ఖాళీ దొరికితే చాలు సెల్ ఫోన్ లో పోర్న్ వీడియోలు చూస్తుంటాడు. ఇటీవల డ్రగ్స్‌కు కూడా అలవాటు పడ్డాడు. ఆడపిల్లలను కనిపిస్తే వారితో మాట్లడానికి, పరిచయం పెంచుకోడానికి ప్రయత్నిస్తుంటాడు. ముఖ్యంగా పేద ఆడపిల్లలు వాడి టార్గెట్. కొన్నిసార్లు మహిళలతో అసభ్యంగానూ ప్రవర్తించాడు. గంజాయి బానిసలతో కలసి మద్యం తాగేవాడు.

 

రెండు హత్యల కేసుల్లో అతని పేరు ఎఫ్ఐఆర్‌కు ఎక్కింది. అయినా పోలీసుల అతనిపై నిఘా పెట్టలేదు. హాజీపూర్ గ్రామానికి బస్సు సౌకర్యం సరిగ్గా లేకపోవడం శ్రీనివాస్ రెడ్డికి వరంగా మారింది. లిఫ్ట్ పేరుతో అమ్మాయిలను బైక్‌పై ఎక్కించుకుంటాడు. వారిని మచ్చిక చేసుకుంటాడు. నమ్మకం కలిగేలా చేస్తాడు. ఆ తర్వాత బైక్ పై ఎక్కించుకుని బావి దగ్గరికి తీసుకొచ్చి వారిపై అత్యాచారం చేసి చంపేస్తాడు. మృతదేహాన్ని తనకు చెందిన పాడుబడ్డ వ్యవసాయ బావిలోనే పూడ్చిపెడతాడు. బావిలో దిగడం, పైకి రావడంలో శ్రీనివాస్ సిద్ధహస్తుడు.

 

సీసీఫుటేజీ ఆధారంగా శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు పట్టుకోగలిగారు. అందులో శ్రీనివాస రెడ్డి శ్రావణిని బైక్‌పై తీసుకెళ్తూ కనిపించాడు. తర్వాత ఆమె ఆచూకీ లేకుండా పోయింది. సీసీఫుటేజీ ఆధారంగానే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తాను అమ్మాయిలను కొట్టి, బావిలో పడేసేవాడినని, వారు కొనవూపిరితో ఉన్నప్పుడు అత్యాచారం చేసి చంపేసేవాడినని శ్రీనివాసరెడ్డి పోలీసులకు చెప్పాడు. ఈ నేరాల్లో అతనితోపాటు మరికొందరి హస్తం కూడా ఉండొచ్చని, పూర్తి వివరాలను దర్యాప్తులో తేలుతాయని పోలీసులు చెబుతున్నారు. శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష పడేలా చూస్తామని పోలీసులు చెప్పారు. హాజీపూర్ మహిళలు, బాలికలు జాగ్రత్తగా ఉండాలని, అనుమానితుల సమాచారాన్ని తమకు ఇవ్వాలని కోరారు.

 

సీరియల్ హత్యలతో హాజీపూర్ గ్రామస్తులు హడలిపోయారు. మానవ మృగం శ్రీనివాస్ రెడ్డి అకృత్యాల గురించి తెలుసుకున్నాక వారి కోపం కట్టలు తెంచుకుంది. మూకుమ్మడిగా వెళ్లి శ్రీనివాస్ ఇళ్లపై దాడులు చేశారు. వాడిని ఇళ్లను ధ్వంసం చేసి తగులబెట్టారు. ఆ నరహంతకుడిని ఉరి తియ్యాలని డిమాండ్ చేస్తున్నారు.

 

అదే సమయంలో తల్లిదండ్రులకు, ఆడపిల్లలకు, మహిళలకు పోలీసులు కీలక విజ్ఞప్తి చేశారు. అపరిచితులను లిఫ్ట్ అడగొద్దని సూచించారు. వారి వాహనాల్లో వెళ్లొద్దని చెప్పారు. ఎవరైనా తెలియని వ్యక్తులు లిఫ్ట్ ఇస్తామని చెబితే.. ఆ వాహనం ఎక్కడానికి నిరాకరించాలని చెప్పారు. పరిచయం లేని వారితో మాట్లాడొద్దని, వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని అమ్మాయిలకు చెప్పారు.

Tags : bommalaramaramhazipurhazipur serial killerkalpanamanishamarri srinivas reddymurderPsycho killersravaniyadadri bhongir

Also read

Use Facebook to Comment on this PostMenu