06/1/17 2:53 PM

ఇంట్లో కరెంటే లేని కుర్రాడు ఇప్పుడు IAS అధికారి అయ్యాడు

IAS Topper GopalaKrishna

గ‌దిలో లాంత‌రు వెలుగుతోంది.. పేదరికం అనే చీక‌టి ఏళ్ల‌కు ఏళ్లు ఆఇంటిని, ఆ కుటుంబాన్ని ఏలుతోంది. న‌మ్ముకున్న నేల ప‌ట్టెడ‌న్నం పెడు తుందే త‌ప్ప క‌ష్టాలు గ‌ట్టెక్కించ‌డం లేదు. గ‌ట్టిమేలు ఏదీ త‌ల‌పెట్ట‌డం లేదు. కూలి ప‌నుల‌తో పొట్ట పోషించుకునే  త‌ల్లిదండ్రులు కంట వెలుగు ఆ ఇద్ద‌రు బిడ్డ‌లు. వారిలో ఒక‌రు బ్యాంక్ మేనేజ‌ర్ , ఇంకొక‌రు నేటి సివిల్స్ టాప‌ర్ రోణంకి గోపాల కృష్ణ‌. నిరంత‌ర సాధ‌న‌కు తార్కాణం ఈ విజ‌యం. వీధి బ‌డి ఇచ్చిన విజ‌యం. అవ‌మానం నేర్పిన పాఠం.. అస‌మాన ప్ర‌జ్ఞా పాఠ‌వాన్ని సొంతం చేసుకునేలా చేసింది. రండి! రోణంకి వారింటి అబ్బాయ్ గురించి మ‌రింత తెల్సుకుందాం. స్ఫూర్తిపొందుదాం.

మేలుకో పాల‌కా మేలుకో..!! : చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా..! 

తెలుగులోనే ప్రిలిమ్స్ నుంచి ఇంట‌ర్వ్యూ వ‌ర‌కూ స‌న్న‌ద్ధ‌మై తానేంటో నిరూపించిన ఈ సిక్కోలు కుర్రాడి గెలుపు తెలుగు మాధ్య‌మంలో బోధించ‌డ మే అన‌వ‌సరం అని భావిస్తున్న పాల‌కులు ఓ క‌నువిప్పు. ఒక నిమ్న కులం వారింట్లో భోజనం చేసారనే సాకుతో గోపాలకృష్ణ కుటుంబాన్ని ఆ ఊరు వెలివేసింది.. ఇప్పుడ‌దే ఊరు ఆ కుర్రాడి విజ‌యాన్ని గొప్ప‌గా చెప్పుకుంటోంది. అంతేతేడా! గెలుపు మాత్ర‌మే నిన్న‌టి ప‌రిస్థితిని తారుమారు చేయ‌గ‌ల‌దు అనేందుకో తార్కాణం సివిల్స్ లో ఆయ‌న సాధించిన ఈ అనూహ్య ఫ‌లితం. జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించ‌డం వెనుక 11 ఏళ్ల  కృషి ఉంది. ఇంకా కొన్ని అప‌జ‌యాలు ఉన్నాయి. ఓట‌మికి వెర‌వని మ‌నో నిబ్బరం ఉంది. అనేకానేక మ‌లుపులు ఉన్నాయ్‌.

 

అప‌జ‌యాలే ఆలంబ‌న : బ‌డి నుంచి బ‌డి వ‌ర‌కు 

ఓ సాధార‌ణ పాఠ‌శాల అంత‌క‌న్నా అతి సాధార‌ణ జీవితం ,దూర విద్య ద్వారా బీఎస్సీ పూర్తిచేసిన నేప‌థ్యం, 2011లో గ్రూప్ – 1  సాధించినా అప్ప‌టి ప‌రిస్థితులు కార‌ణంగా కొలువు ద‌క్క‌ని వైనం.. ఐనా నిరాశ‌ని ఆశ్ర‌యించలేదా కుర్రాడు.త‌న మండ‌లం నుంచి ఐఏఎస్‌గా ఎంపికైన రెండో వాడిగా రికార్డు సృష్టించాడు. అవ‌రోధాల‌న్నింటిని అధిగ‌మించి శ్ర‌మ‌వేదం ఔన్న‌త్యాన్ని, కృషి ప‌ట్టుద‌ల‌కు ఉన్న ప్రాధాన్యాన్ని మ‌రోమారు నిరూపించాడు.

 

నిజ‌మే అన‌గ అన‌గ రాగం తిన‌గ తిన‌గ వేము ఇవ‌న్నీ గొప్పగానే అనిపిస్తాయ్‌. తెలుగు సాహిత్యం ఐచ్ఛికంగా ఎంచుకున్న కుర్రాడికి తెల్సు మ‌రో ప్ర‌పంచం త‌న ముందుంద‌ని.. ఇంట‌ర్ వర‌కూ క‌రెంట్ కూడా లేని ఆ ఇంటికి వెలుగొక పండుగ అని తెల్సు. త‌న విజయం సంక్రాంతికి మించిన పండుగ అనీ తెల్సు.ఔను! వ్య‌వ‌సాయం మాత్రమే తెల్సిన ఆ..త‌ల్లిదండ్రుల‌కు (అప్పారావు, రుక్మిణ‌మ్మ‌) పుత్రోత్సాహం ప‌ట్ట‌రాని సంతోషాన్ని స్తోంది.గుండె గూటికి పండ‌గొచ్చింది అంటామే అంటే ఇదేనేమో!! అంతేనా !! ఆ..నేల‌త‌ల్లి విజ‌య‌గ‌ర్వంతో ఉప్పొంగిపోతోంది. పుల‌కిస్తోంది.

 

ఆది నుంచి అవ‌స్థ‌లే..! 

 

ప‌లాస మున్సిపాల్టీ.. అది ఓ మారుమూల ప్రాంతం పార‌సంబ‌. అక్కడే మొద‌లైన  బాల్యం అవ‌స్థ‌ల‌తోనే  గ‌డిచింది. స్థానిక పాఠ‌శాల‌లో ఐదో త‌ర‌గ‌తి వ‌ర‌కూ ఓ వీధి బ‌డిలో చ‌దువుకున్న ఆ కుర్రాడు త‌రువాత కూడా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లోనే విద్యాభ్యాసం సాగించాడు. ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కూ బ్రాహ్మ‌ణ త‌ర్ల జెడ్పీ హెచ్‌లో, అటుపై ఇంట‌ర్ ప‌లాస జూనియ‌ర్ క‌ళాశాల‌లో అభ్య‌సించాడు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా దూబ‌చ‌ర్ల‌లో టీటీసీ చ‌దివి, 2006 డీఎస్సీలో విజేత‌గా నిలిచాడు. ప్ర‌స్తుతం ప‌లాస మండ‌లం, రేగులపాడులో పాఠ‌శాల‌లో సెకండ‌రీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా ప‌నిచేస్తున్నాడీయ‌న‌. సివిల్స్ సాధ‌నే  ధ్యేయంగా క‌ఠోర శ్ర‌మ కోర్చి హైద్రాబాద్‌లో ఓ స్ట‌డీ సెంట‌ర్ లో జ‌న‌ర‌ల్ స్ట‌డీస్ పై ప‌ట్టుపెంచుకుని, గ్రామీణ యువ‌త త‌ల్చుకుంటే మాధ్య‌మం అన్న‌ది అవ‌రోధం కాద‌ని నిరూపించాడు.ఇంగ్లీష్ లో రాస్తేనే సివిల్స్‌లో విజ‌యం అన్న భ్ర‌మ‌ల‌ను సునాయ‌సంగా తొల‌గించేసి విజయుడిగా నిలిచాడు.స‌ర్కారు బ‌డి ఔన్న‌త్య‌మేంటో చాటాడు. సివిల్స్ ఇంట‌ర్వ్యూ లో సైతం ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లే త‌న‌నింతటి వాడిని చేశాయ‌ని గ‌ర్వంగా చెప్పాడు.

తెలుగు భాష గొప్ప‌ద‌నం

తెలుగు భాష తియ్య‌ద‌నం

అంతా మ‌రిచిపోతున్న తరుణంలో

ఓ మారుమూల ప్రాంతంలో పుట్టిపెరిగిన ఈ కుర్రాడు .ఎన్నో హేళ‌న‌లు, అవ‌మానాలు భ‌రించి సిక్కోలు కీర్తిని మ‌రింత ఇనుమ‌డింప‌జేశాడు.

ఇప్పుడు గ‌దిలో దీపం దేదీప్య‌మానంగా వెలుగుతోంది.అలానే ఆత‌డి విజ‌యం  చూసి ఆ త‌ల్లిదండ్రుల క‌ళ్ల‌ల్లో వెలుగులూ కాంతులీనుతున్నాయ్‌. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్రాథ‌మిక విద్య‌ను బ‌లోపేతం చేయ‌డ‌మే త‌న‌ముందున్న క‌ర్త‌వ్యం అని చెబుతున్న గోపాల కృష్ణ సివిల్ స‌ర్వెంట్‌గా ఇంకా.. ఇంకా..ఎన్నో ఎన్నో ఉన్న‌త శిఖ‌రాలు చేరుకోవాల‌ని ఆశిద్దాం.ప‌ల్లె ప్రాంతం నుంచి వ‌చ్చిన ఇటువంటి తేజాల‌ను మ‌న‌స్ఫూర్తిగా అభినందిద్దాం.

ఇది ఆకుప‌చ్చ‌ని జ్ఞాప‌కం. మ‌నంద‌రి విజ‌యం. తెలుగు వెలుగులీనుతున్న తరుణం. జాతికి ఈ ప‌రిణామం ఎంతో గ‌ర్వ‌కార‌ణం.రోణంకి వారింటి వంశాంకుర‌మా! అందుకో శుభాకాంక్ష‌లు.

– ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

 

నోట్:  కిరోసిన్ లాంతరు వెలుగులో చదువుకుంటున్న ఫోటో గోపాలకృష్ణది కాదు

Tags : EducationiasIAS Topper Gopala KrishnaPovertyRonanki Gopalakrishnasrikakulam

Also read

Use Facebook to Comment on this PostMenu