12/15/18 2:39 PM

ఆ ఇద్దరూ కలిసి వస్తే జగన్‌ గెలుస్తారా?

Will Jagan Become Of AP

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు జోక్యం చేసుకున్నారు కనుక.. ఏపీ రాజకీయాల్లో నేను కూడా జోక్యం చేసుకుంటానని, చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఇక మజ్లిస్ నేత అసదుద్దీన్ ఓవైసీ అగ్నికి ఆజ్యం పోశారు. కేసీఆరే కాదు నేను కూడా ఏపీకి వస్తాను, జగన్‌కు మద్దతుగా ప్రచారం చేస్తామని బాంబు పేల్చారు. కేసీఆర్, ఓవైసీ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలను మరింత హీటెక్కించాయి. ఒకవేళ కేసీఆర్, ఓవైసీ ఆంధ్రాకు వచ్చి ప్రచారం చేస్తే.. అది ఎవరికి ప్లస్ అవుతుంది? ఎవరికి మైనస్ అవుతుంది? లాభపడేది చంద్రబాబా? జగనా? అనేది హాట్ టాపిక్‌గా మారింది.

 

చంద్రబాబూ.. ఆంధ్రాకు వస్తున్నా కాస్కో అని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. చంద్రబాబు ఎన్నికల కోసం తెలంగాణ వచ్చినప్పుడు.. మేమెందుకు ఆంధ్రాకు వెళ్లకూడదని ప్రశ్నించారు. నేనూ ఆంధ్రాకు వస్తా.. నా సత్తా ఏంటో చూపిస్తా అని ఓవైసీ ఛాలెంజ్ చేశారు. అంతేకాదు వైసీపీ అధినేత జగన్‌కు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. జగన్‌ తనకు మంచి మిత్రుడని, కచ్చితంగా ఆంధ్రకు వెళ్లి తీరుతానని.. జగన్‌కు మద్దతుగా ప్రచారం చేస్తానని ఓవైసీ తేల్చి చెప్పారు. ప్రజల్లో చంద్రబాబుపై చాలా వ్యతిరేకత ఉందని.. ప్రజా వ్యతిరేకత అంటే ఏంటో చంద్రబాబుకి చూపిస్తానని అన్నారు. ఏపీలో టీడీపీకి ఘోర పరాజయం తప్పదని..2019 ఎన్నికల్లో ఆ పార్టీకి కనీసం రెండు ఎంపీ సీట్లు కూడా రావని ఓవైసీ జోస్యం చెప్పారు. కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం చేసినా… తెలంగాణలో చంద్రబాబు ఫలితాలు సాధించలేకపోయారని.. ఏపీలో నేను ప్రచారం చేస్తే ప్రభావం ఎలా ఉంటుందో చంద్రబాబుకి తెలుస్తుందని అసద్‌ అన్నారు. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెసేతర కూటమి రావాల్సిన అవసరం ఉందని.. ఈ కూటమిని నడిపించేందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సరైన వ్యక్తి అని ఓవైసీ అభిప్రాయపడ్డారు.

 

ఏపీకి వస్తాము, చంద్రబాబుని ఓడిస్తాము అంటూ కేసీఆర్, ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు ఎదురుదాడికి దిగారు. వాళ్లిద్దరూ వచ్చినా టీడీపీని ఏమీ చేయలేరని, చంద్రబాబుదే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబుపై విమర్శలు చేయడం కేసీఆర్, ఓవైసీకి తగదన్నారు. మీది, మాది ఒకటే నినాదం…మోదీ హఠావో- దేశ్ బచావో.. మోదీతో లాలూచీ పడిన జగన్‌కు మద్దతిస్తామనడం సరికాదు.. జగన్ ఎవరివైపు ఉన్నారో తెలుసుకుని మద్దతివ్వాలి అని టీడీపీ నాయకులు హితవు పలికారు. కేసీఆర్ కోసమే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ పోటీ చేయలేదని ఆరోపించారు. మజ్లిస్, వైసీపీ, జనసేనను కేసీఆర్ నడిపిస్తున్నారని అన్నారు. చంద్రబాబు గిఫ్ట్ ఇస్తే కేసీఆర్ సీఎం అయ్యారు.. అలాగే కేసీఆర్ గిఫ్ట్ ఇస్తే బాబు ఏపీలో ముఖ్యమంత్రి అవుతారని సబ్బం హరి అన్నారు.

 

ఏపీకి వస్తా.. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటూ కేసీఆర్ ఇచ్చిన వార్నింగ్‌పై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఈ దేశంలో ఎవరు ఎక్కడైనా ప్రచారం చేసుకోవచ్చు అంటూనే.. ఎవరికీ భయపడేది లేదని ఎదురుదాడి చేశారు. దొంగ దెబ్బతీయాలని చూస్తే టీడీపీ బొబ్బిలిపులిలా ముందుకెళ్తుందన్నారు. టీడీపీ పుట్టింది తెలంగాణలోనే అని, కేసీఆర్ కూడా టీడీపీలో ఉన్నవారే అని గుర్తు చేశారు. ‘ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ చెప్పినప్పుడు.. కేసీఆర్‌ ఇవ్వాలన్నారు.. ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. హోదాను వ్యతిరేకించిన టీఆర్‌ఎస్‌ను జగన్‌, పవన్‌ సమర్థిస్తున్నారు. వీరితో ప్రధాని నరేంద్రమోదీ నాటకాలాడిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం పవన్‌, జగన్‌, కేసీఆర్‌ను మనపై ఎగదోస్తున్నారు’ అని మండిపడ్డారు.

 

కేసీఆర్, ఓవైసీ చేసిన వ్యాఖ్యలు వైసీపీ నాయకుల్లో హుషారు నింపాయి. పొరుగు రాష్ట్రం నాయకుల నుంచి కూడా సపోర్ట్ లభించడం పట్ల వారు ఆనందంగా ఉన్నారు. ఏపీకి వచ్చి తమకు మద్దతుగా ప్రచారం చేస్తామనే వ్యాఖ్యలను వైసీపీ నాయకులు లోలోన స్వాగతిస్తున్నారు. మొత్తంగా ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికలు రసవత్తరంగా ఉండనున్నాయనేది స్పష్టంగా తెలుస్తోంది. మరి ఎవరి ప్రచారం ఎవరికి ప్లస్ అవుతుందో? ఎవరికి మైనస్ అవుతుందో చూడాలి.

Tags : ap politicsasaduddin owaisichandrababuKCRkcr campaing in andhra pradeshys jagan

Also read

Use Facebook to Comment on this PostMenu