07/4/19 12:39 PM

మరీ ఇంత పగా : ఏకంగా కెరీర్ నే నాశనం చేశాడు.. తెలుగువాడు కావడమే శాపమైంది..

Injustice For Telugu Tejam Ambati Rayudu

టాలెంట్ ఉంచే చాలు.. అవకాశాలు వాటంతట అవే వస్తాయంటారు. ప్రతిభతో సాధించలేనిది ఏదీ లేదంటారు. కానీ.. భారత క్రికెట్ లో మాత్రం ఈ ఫార్ములా వర్కవుట్ కాదు. బీసీసీఐలో కుల, ప్రాంత సమీకరణాలూ ప్రభావం చూపిస్తాయి. జట్టులో సెలెక్ట్ కావాలంటే.. మనోడై ఉండాలి. లేదంటే.. ఎంత టాలెంట్ ఉన్నా తొక్కేస్తారు, కెరీర్ ని కూడా నాశనం చేస్తారు.. అని చెప్పడానికి పెద్ద ఉదాహరణే తెలుగు తేజం అంబటి రాయుడు. అవును.. టాలెంటెడ్ క్రికెటర్ అంబటి రాయుడికి తీరని అన్యాయం జరిగింది. ఓ తెలుగు వాడే మరో తెలుగు వాడికి శత్రువయ్యాడు. ఓ తెలుగువాడే సాటి తెలుగువాడి కెరీర్ ను నాశనం చేశాడు. నేను బాగుపడకపోయినా పర్లేదు.. పక్కనోడు మాత్రం బాగుపడకూడదు.. వాడికి పేరు, ప్రఖ్యాతలు రాకూడనే వాళ్లు బీసీసీఐ సెలెక్టర్లుగా ఉన్నారు.

 

భారత క్రికెట్ లో అంబటి రాయుడు వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అంబటి రాయుడికి అన్యాయం జరిగిందని అంతా వాపోతున్నారు. వరల్డ్ కప్ జట్టులోకి సెలెక్ట్ చెయ్యకపోవడంతో తీవ్రంగా నిరాశ చెందిన అంబటి రాయుడు.. సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అర్ధాంతరంగా క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్‌లో కూడా ఆడబోనని స్పష్టం చేశాడు. వరల్డ్ కప్ జట్టుకు తనను ఎంపిక చేయకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న రాయుడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. గాయం కారణంగా వైదొలిగిన ఆల్ రౌండర్ విజయ్ శంకర్ స్థానంలో తనను కాకుండా మయాంక్ అగర్వాల్‌ను ఎంపిక చేయడాన్ని రాయుడు జీర్ణించుకోలేకపోయాడు.

 

ప్రపంచ కప్‌లో ఆడబోయే టీమిండియాను బీసీసీఐ ప్రకటించినప్పుడు ఆ జట్టులో పంత్, రాయుడు పేర్లు లేకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ మధ్య కాలంలో అద్భుతంగా రాణిస్తున్న వీరిద్దరూ లేకుండా జట్టు ఎంపిక ఏంటని అంతా ప్రశ్నించారు. దీంతో పంత్, రాయుడిని స్టాండ్ బై ప్లేయర్లుగా ఎంపిక చేశారు. శిఖర్ ధావన్ గాయం కారణంగా ప్రపంచ కప్ టోర్నీ నుంచి తప్పుకోవడంతో పంత్‌ను పిలిచారు. ఆ తర్వాత విజయ్ శంకర్‌కు గాయం కావడంతో రాయుడు ఎంపిక తథ్యమని అంతా అనుకున్నారు. కానీ, రాయుడికి సెలెక్టర్లు షాక్ ఇచ్చారు. స్టాండ్ బైలో ఉన్న రాయుడిని కాదని మయాంక్ అగర్వాల్‌ను ఎంపిక చేశారు. ఈ నిర్ణయంతో రాయుడు షాక్ తిన్నాడు. ఇక లాభం లేదని డిసైడ్ అయిన రాయుడు.. ఏకంగా క్రికెట్ కే గుడ్ బై చెప్పేశాడు.

 

అంబటి రాయుడికి తీవ్ర అన్యాయం చేసిన వ్యక్తి బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అనే ఆరోపణలు వెల్లువెత్తాయి. క్రికెట్ అభిమానులు, రాయుడు ఫ్యాన్స్ అంతా ఎమ్మెస్కే ప్రసాద్ ని నిందిస్తున్నారు. ఓ తెలుగు వాడికి మరో తెలుగు వాడే అన్యాయం చేశాడని నెటిజన్లు వాపోతున్నారు. అంబటి రాయుడు, చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఇద్దరిదీ ఆంధ్రప్రదేశే. అందులోనూ గుంటూరు జిల్లా. ఓ తెలుగోడు వరల్డ్ కప్ ఆడే అవకాశాన్ని మరో తెలుగోడు కాలరాశాడని నెటిజన్లు ఎమ్మెస్కే ప్రసాద్‌పై తీవ్రంగా మండిపడుతున్నారు. 54 వన్డేలు ఆడిన రాయుడు 3 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు చేశాడు. ఎక్కువగా నాలుగో స్థానంలో ఆడిన రాయుడు 40కిపైగా యావరేజ్ తో పరుగులు రాబట్టాడు. తన కెరీర్ లో కనీసం 130 పరుగులు కూడా చేయని వ్యక్తి బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అయ్యాడు.. సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవికి సరిపడని వ్యక్తి ఆ పదవిలో ఉంటే ఇలాగే ఉంటుందని నెటిజన్లు ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

 

బీసీసీఐ రాజకీయాలకు మరో టాలెంట్ నాశనమైంది. దీనికి ప్రధాన కారణం ఎమ్మెస్కే ప్రసాద్ అని తిడుతున్నారు. ‘యువీ కెరీర్‌ను క్యాన్సర్ నాశనం చేస్తే.. అంబటి రాయుడి కెరీర్‌ను ఎమ్మెస్కే ప్రసాద్ నాశనం చేశాడు. వీళ్లు సెలెక్టర్లు కాదు రాజకీయ నాయకులు. రాయుడూ.. నిన్ను మిస్సవుతాం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టుమని పాతిక మ్యాచ్‌లు ఆడని ఎమ్మెస్కే ప్రసాద్ చీఫ్ సెలెక్టర్ ఎలా అవుతాడు? అతడు 3డీ క్రికెటరా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఇగో కారణంగా రాయుడు రిటైరయ్యాడు. వరల్డ్ కప్‌కి ఎంపిక చేయకుండా అతణ్ని మూడుసార్లు పక్కనబెట్టారని నెటిజన్లు ఫైర్ అయ్యారు.

 

12 ఏళ్ల కెరీర్ లో ఎన్నో తిరస్కారాలు, అవమానాలు, మోసాలు, రాజకీయాలు, కుళ్లు, కుతంత్రాలను రాయుడు చూశాడు. కానీ ఎప్పుడూ కుంగిపోలేదు, అధైర్యపడలేదు. పోరాటమే శ్వాసగా బతికాడు. పడిన ప్రతిసారి లేచాడు. విమర్శలకు బ్యాట్ తోనే సమాధానం చెప్పాడు. ఎంత టాలెంట్ ఉన్నా ఏం లాభం.. తెలుగు వాడు కావడమే అతడి పాలిట శాపమైంది.

 

”తెలుగువాడైన మాజీ వికెట్ కీపర్, BCCI చీఫ్ సెలెక్టర్ MSK ప్రసాద్ కి వచ్చిన కష్టం మరెవ్వరికీ రాకూడదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్ళీ మళ్ళీ మరో తెలుగువాడైన అంబటి రాయుడు పేరు తెరపైకి రావడం MSK సర్ కి చికాకు తెప్పించింది. ఒక తెలుగు వాడై, మరో తెలుగు వాడిని వరల్డ్ కప్ కి ఎంపిక చేయాల్సి రావడం బాధగా ఉండదాండి? పైగా బోలెడన్ని ప్లాన్స్ వేశాక కూడా మళ్ళీ మళ్ళీ అదే తెలుగువాడిని సెలెక్ట్ చేయమంటే ఆవేదన కలగదాండి ? ఒక చీఫ్ సెలెక్టర్ గా ఆ మాత్రం ప్లాన్ చేసుకునే స్వేచ్చ ఉండదాండి ? ఎట్టకేలకు మూడోసారి కూడా మన MSK సర్ సక్సెస్ అయినందుకు అభినందనలు… పంత్, మయాంక్ ఇద్దరూ బయటి నుండి జట్టులోకి వచ్చారు. కాని స్టాండ్ బై లో వరల్డ్ కప్ కి ఎంపికైన అంబటిని మాత్రం స్టాండ్ బై గా నే ఉంచారు. ప్లాన్ చేయడంలో మాస్టర్స్ సేస్తిరి … స్కెచ్ గీయడంలో డాక్టరేట్ సేస్తిరి. MSK గారిని మన తెలుగు రాష్ట్రాల ప్రజలు సముచిత రీతిలో గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేవలం ఈ ప్లాన్ చేసి, స్కెచ్ గీసి అంబటిని సంక నాకించడం MSK సోలో పెర్ఫామెన్సేనా, లేక మన రవి శాస్త్రి, కోహ్లిలు కూడా హెల్ప్ చేశారా ? అయినా ఒక తెలుగు వాడిగా మరో తెలుగువాడు రాకుండా చూడ్డానికి MSK పడ్డ కష్టం, తపన, చేసిన పోరాటం అభినందించదగ్గదే…” అంబటి రాయుడు కెరీర్ నాశనం కావడం తట్టుకోలేక ఓ తెలుగు అభిమాని వెలిబుచ్చిన ఆవేదన ఇది.

 

ఏది ఏమైనా.. అన్యాయం అయితే జరిగిపోయింది. ఇప్పుడు ఎవరెంత ఆవేదన వ్యక్తం చేసినా, కడుపు చించుకున్నా ప్రయోజనం లేదు. ఎమ్మెస్సే ప్రసాద్ లాంటి వ్యక్తులు ఉన్నంత కాలం.. ఇలాంటి కుల, ప్రాంత వివక్షలు తప్పవు. కులం, మతం, ప్రాంతం అన్న గజ్జి ఉన్నంతకాలం మన దేశం క్రీడల్లో వెనకబడే ఉంటుంది. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న విమర్శలతోనైనా చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కి కనువిప్పు కలగాలని, మార్పు రావాలని, మనిషిగా మారాలని ఆశిద్దాం. భవిష్యత్తులో మరో టాలెంటెడ్ క్రికెటర్ కి అన్యాయం జరక్కుండా ఉండాలని కోరుకుందాం.

Tags : Ambati RayudubcciCRICKET.msk prasadretirmentTeluguWorld Cup

Also read

Use Facebook to Comment on this PostMenu