06/18/19 11:44 AM

ఏపీలో ఏం జరుగుతోంది? టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నది ఎవరు?

Is It Political Vendetta, Attacks On TDP Leaders

ఏపీలో అప్పుడే రాజకీయం వేడెక్కింది. ఏపీలో దాడుల వ్యవహారం కలకలం రేపుతోంది. అధికార పక్ష నేతలు తమపై దాడులు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అంటున్నారు. టీడీపీ ఓడిన 3 వారాల్లోనే తమవారిపై 100కు పైగా దాడులు జరిగాయని ఏకంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ రౌడీలు తమ వాళ్లపై దాడులు చేస్తున్నారని నారా లోకేష్ సైతం మండిపడ్డారు. ఇదేనా రాజన్న రాజ్యం అని ఆయన నిలదీశారు.

 

ఏపీలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని చంద్రబాబు వాపోయారు. టీడీపీ ఓటమి పాలైన 3 వారాల్లో రాష్ట్రంలోని 100 చోట్ల దాడులు చోటు చేసుకున్నాయని చంద్రబాబు ఆవేదన చెందారు. గ్రామ స్థాయిలో కార్యకర్తలకు నేతలు అండగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పారు. కార్యకర్తల కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో టీడీపీ 5 సార్లు విజయం సాధించినా ఏనాడూ ప్రత్యర్థులపై దాడులు చేయలేదని చంద్రబాబు అన్నారు. కానీ, ప్రత్యర్థులు విజయం సాధించినప్పుడల్లా టీడీపీ వాళ్లపై దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు గుర్తు చేశారు. నేతలు కార్యకర్తలకు అండగా ఉండాలని చంద్రబాబు సూచించారు. ప్రత్యర్థులు గెలిచినప్పుడు టీడీపీ కార్యకర్తలపై దాడులు చేయటం అలవాటుగా మారిపోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

ఎన్నికల్లో గెలుపు అన్నది బాధ్యతను పెంచాలి తప్ప అరాచకాలకు మార్గం కాకూడదని నారా లోకేష్ హితవు పలికారు. టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులపై వైసీపీ రౌడీలు దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు, దౌర్జన్యాలతో టీడీపీ పార్టీ కేడర్ సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు. గుంటూరు జిల్లాలో పిన్నెల్లి గ్రామంలో టీడీపీకి ఓటేశారని రైతులను ఐదేళ్ల పాటు గ్రామ బహిష్కరణ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

 

నెల్లూరు జిల్లాలోని వెంకటేశ్వరపురం, గాంధీ గిరిజన కాలనీలో ప్రజలు టీడీపీకి ఓటేసినందుకు పేదల గుడిసెలు కూల్చడానికి ప్రయత్నించారని మండిపడ్డారు. ఇలా ఏపీ అంతటా 100 దాడి ఘటనలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. ‘ఇదేనా మీరు చెప్పిన రాజన్న రాజ్యం?’ అని లోకేష్ సీఎం జగన్ ని నిలదీశారు. ఇప్పటికయినా పోలీస్ యంత్రాంగం స్పందించి అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు.

 

అనంతపురం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమ పార్టీ నాయకులపై వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనంతపురం టీడీపీ జిల్లా అధ్యక్షుడు పార్ధసారథితో కలిసి మాజీ మంత్రులు పరిటాల సునీత, కాలువ శ్రీనివాసులు జిల్లా ఎస్పీ సత్యయేసు బాబును కలిశారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత తమ పార్టీ నేతలపై దాడులు జరుగుతున్నాయని, వీటిని అరికట్టాలని విజ్ఞప్తి చేశారు.

 

వైసీపీ నాయకులు గ్రామాల్లో రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తున్నారని, తమ పార్టీ నేతలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కాలువ శ్రీనివాసులు ఆరోపించారు. తన భర్త పరిటాల రవీంద్ర ట్రస్టు నిర్మించిన వాటర్ ప్లాంట్లను వైసీపీ నేతలు ధ్వంసం చేస్తున్నారని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ధ్వంసం చేయడం, అకారణంగా దాడులు చేయడంపై పరిటాల సునీత మండిపడ్డారు.

 

టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు, లోకేష్ చేసిన ఆరోపణలపై అధికార పార్టీ నాయకులు తీవ్రంగా స్పందించారు. దాడుల ఆరోపణలను వైసీపీ నేతలు ఖండించారు. రాజన్న రాజ్యం ఇదేనా.. అంటూ ట్విట్టర్ వేదికగా చేసిన పోస్టుకు నారా లోకేష్ పై నిప్పులు చెరిగారు ఏపీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత. ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని చెప్పారు. వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలే దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పైగా నిందను వైసీపీ నాయకుల మీద నెడుతున్నారని లోకేష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా లోకేష్ దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని మంత్రి మేకతోటి సుచరిత ఫైర్ అయ్యారు. ఇటీవల జరిగిన దాడుల్లో 44మంది టీడీపీ కార్యకర్తలు గాయపడితే వైసీపీ నేతలు 57మంది గాయపడ్డారని ఆమె చెప్పుకొచ్చారు. అసలు దాడులు చేస్తుంది టీడీపీ నేతలే అని ఆమె ఆరోపించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి ఆదేశానుసారం కట్టుదిట్టమైన భద్రతను ఉంచినా టీడీపీ నేతలు మాత్రం రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు.

 

మొత్తంగా దాడుల వ్యవహారంలో ఏపీలో దుమారం రేపుతోంది. ఎవరు ఎవరిపై దాడులు చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఎవరి ఆరోపణల్లో ఎంత వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

Tags : andhra pradeshAttackschandrababunara lokeshpolitical vendettaTDPYs jagan mohan reddyysr congress party

Also read

Use Facebook to Comment on this PostMenu