03/16/18 2:58 PM

కిరాక్ పార్టీ సినిమా రివ్యూ

Nikhil Kirrak Party review

నటీనటులు: నిఖిల్, సంయుక్త హెగ్డే, సిమ్రన్ తదితరులు

సంగీతం: అజనీష్ లోక్ నాథ్

సినిమాటోగ్రఫీ: అధ్వైత గురుమూర్తి

ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ

నిర్మాతలు: రామ బ్రహ్మం సుంకర్, అనిల్ సుంకర

దర్శకత్వం: శరణ్ కొప్పిశెట్టి

కథ:

కృష్ణ(నిఖిల్) కాలేజ్ స్టూడెంట్. తన స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతుంటాడు. కాలేజ్ లో సీనియర్లు, గొడవలు అంటూ ఒకరకమైన లైఫ్ ను లీడ్ చేస్తుంటాడు. అందరి స్టూడెంట్స్ లానే తనకు కూడా ఒక గ్యాంగ్. అయితే తనకంటే మూడేళ్లు సీనియర్ అయిన మీరా(సిమ్రన్) అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. మీరా అంటే కాలేజ్ లో కొంచెం క్రేజ్. చాలా మంది ఆమెను ప్రేమిస్తుంటారు. కానీ మీరా మాత్రం కృష్ణకు దగ్గరవుతుంది. అంతా బాగుంది అనుకునేలోపు మీరా సడెన్ గా చనిపోతుంది. ఆ బాధలో కృష్ణ చాలా అగ్రెసివ్ గా తయారవుతాడు. మొండివాడిగా మారిన కృష్ణ తన ప్రవర్తన కారణంగా బెస్ట్ ఫ్రెండ్ అయిన అర్జున్(రాకేందు మౌళి)ను దూరం చేసుకుంటాడు. అటువంటి క్యారెక్టర్ గల కృష్ణను సత్య(సంయుక్త హెగ్డే) ఇష్టపడుతుంది. ఆ తరువాత కృష్ణ జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి..? కృష్ణ తన ఫ్రెండ్ అయిన అర్జున్ తో కలిసిపోతాడా..? సత్యను ప్రేమిస్తాడా..? అనేదే మిగిలిన కథ.

 

నటీనటుల పెర్ఫార్మన్స్:

ఈ సినిమాలో నిఖిల్ పాత్రకు రెండు షేడ్స్ ఉంటాయి. ఒకటి ఇన్నోసెంట్ స్టూడెంట్ రోల్ కాగా మరొకటి మాసివ్ స్టూడెంట్ లీడర్ క్యారెక్టర్. రెండు షేడ్స్ లో కూడా నిఖిల్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. రగ్గడ్ లుక్ లో మాత్రం కొన్నిచోట్ల నిఖిల్ ను చూడడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. బాడీ లాంగ్వేజ్, ఆటిట్యూడ్ బాగున్నప్పటికీ మీసం మాత్రం పెద్దగా సెట్ కాలేదనిపిస్తుంది. ఆ పాత్రలో నిఖిల్ లో హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికి చాలానే ప్రయత్నించారు. ఇక ఇద్దరు హీరోయిన్లు గ్లామర్ పరంగా నటన పరంగా ఆకట్టుకోలేకపోయారు. రాకేందు మౌళి తన పాత్రలో ఇమిడిపోయాడు. బ్రహ్మాజీ పాత్ర బాగుంది. హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్ మొత్తం కూడా ఆడియన్స్ ను బాగా నవ్విస్తుంది.

 

కథనం, దర్శకత్వం:

కన్నడలో సూపర్ హిట్ అయిన ‘కిరిక్ పార్టీ’ సినిమాకు ఇది రీమేక్. అదే కథలో ఎక్కువ మార్పులు,చేర్పులు చేయకుండా తెలుగు ఆడియన్స్ కు నచ్చే విధంగా తెరపై ఆవిష్కరించాడు దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి. ఫస్ట్ హాఫ్ మొత్తం కాలేజ్, కొన్ని కామెడీ సీన్లు, చిన్న లవ్ ట్రాక్ తో గడిచిపోతుంది. సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. క్రికెట్ ఫైట్ అంటూ యాక్షన్ ఎపిసోడ్ ను కొత్తగా డిజైన్ చేశారు. కానీ కథలో ఎమోషన్ అనేది మిస్ అయింది. సెకండ్ హాఫ్ లో కామెడీ కూడా కాస్త తగ్గిందనే చెప్పాలి. పతాక సన్నివేశాలు మళ్ళీ ఊపందుకుంటాయి. దూరం చేసుకున్న తన స్నేహితుడితో హీరో మళ్ళీ కలవడం వంటి సన్నివేశాలు కొంతవరకు టచ్ చేస్తాయి. ఒరిజినల్ వెర్షన్ ను చూసిన వారికి ఈ సినిమా పెద్దగా నచ్చకపోవచ్చు. కానీ చూడని వారికి మాత్రం ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది.

 

సాంకేతికవర్గం పనితీరు:

ఒరిజినల్ వెర్షన్ కు మ్యూజిక్ కంపోజ్ చేసిన అజనీష్ లోక్ నాథ్ తెలుగులో కూడా మ్యూజిక్ అందించారు. నేపధ్య సంగీతం మక్కీకి మక్కీ దించేశారు. సినిమాకు అదే ప్లస్ అయింది. కొన్ని సన్నివేశాలను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఎలివేట్ చేసింది. పాటలు ఓకే అనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. మాటలు సహజంగా ఉన్నాయి. కామెడీ పంచ్ లు ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ పరంగా కొన్ని తప్పులు దొర్లాయి. సెకండ్ హాఫ్ లో సినిమాలో సాగతీత ఎక్కువైంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి. యూత్ ఫుల్ సినిమాలు, కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఫీల్ గుడ్ సినిమాలు ఇష్టపడే ప్రతి ఒక్కరికీ ఈ కిరాక్ పార్టీ నచ్చుతుంది.

 

ఒక్క మాటలో చెప్పాలంటే.. యూత్ కి మంచి  ఎంటర్టైన్మెంట్

రేటింగ్: 2.75/5

 

Tags : KIRRAK PARTY MOVIE REVIEWNikhil

Also read

Use Facebook to Comment on this PostMenu