09/7/19 8:12 PM

కొత్త మోటారు వాహన చట్టం : జనాలు మారిపోతారా? యాక్సిడెంట్లు ఆగిపోతాయా?

New Motor Vehicles Act Ans Its Impact

సురక్షిత ప్రయాణం, రోడ్డు ప్రమాదాల నివారణ, భద్రతతో కూడిన జర్నీ లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మోటారు వాహనాల చట్టానికి సవరణలు చేసింది. ట్రాఫిక్ రూల్స్ ని మరింత కఠినతరం చేసింది. ట్రాఫిక్ జరిమానాలను భారీగా పెంచేసేంది. కొత్త మోటారు వాహన చట్టం ప్రకారం.. ట్రిపుల్‌ రైడింగ్‌ చేసినా..హెల్మెట్‌ పెట్టుకోకుండా వాహనాలు నడిపినా.. మద్యం తాగి, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ, సీటుబెల్టు పెట్టుకోకుండా డ్రైవింగ్‌ చేసినా..లైసెన్సు లేకున్నా.. చివరికి చిన్నపిల్లలకు వాహనాలు ఇచ్చినా.. భారీగా జరిమానాలతోపాటు జైలుశిక్ష వేయనున్నారు. గతంలో ఉన్న ఫైన్లను ఏకంగా 10 రెట్లు పెంచేశారు. కొత్త మోటారు వాహన చట్టం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో మాత్రం ఇంకా అమల్లోకి రాలేదు. జరిమానాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, వాహనదారులకు అవగాహన కల్పించాల్సి ఉందని ఆయా ప్రభుత్వాలు చెబుతున్నాయి.

 

దేశంలో ఏ రోడ్డును చూసినా రక్తపు మరకలే కనిపిస్తాయి. నిబంధనలు పాటించకపోవడంతో జాతీయ రహదారి, అంతర్‌రాష్ట్ర రహదారులు, గ్రామీణరోడ్లపై సైతం ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. నిర్లక్ష్యపు డ్రైవింగ్ కూడా ప్రాణాలు పోవడానికి కారణం అవుతోంది. ఈ క్రమంలో వాహనదారుల భద్రత లక్ష్యంగా కొత్త మోటారు వాహనాల చట్టం తీసుకొచ్చామని కేంద్రం చెబుతోంది. ప్రమాదాలను నివారించడానికి నిబంధనలను కఠినతరం చేశామని, ఫైన్లు పెంచామని చెబుతోంది. కానీ.. కొత్త మోటారు వాహనాల చట్టంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు స్వాగతిస్తుంటే.. మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

 

ఈ చట్టం కారణంగా రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని కొందరు చెబుతున్నారు. ఇది మంచి చట్టం అని ఇలాంటి నిబంధనలు ఉండాల్సిందేనని సమర్థిస్తున్నారు. వాహనదారుల్లో మార్పు రావాలంటే ఈ మాత్రం ఫైన్లు పడాల్సిందే అని మద్దతు తెలుపుతున్నారు. వాహనదారులు జరిమానాలు చూసైనా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడకుండా ఉంటారని మేధావులు అంటున్నారు. ట్రాఫిక్ నిబంధనలు సక్రమంగా పాటిస్తే రోడ్డు ప్రమాదాలు అరికట్టవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వాహనాలు నడిపే ప్రతిఒక్కరూ విధిగా ట్రాఫిక్‌ నిబంధనలు పాటించి డబ్బును ఆదా చేసుకోవాలని సూచిస్తున్నారు. వాహనదారులు విధిగా హెల్మెట్‌ ధరించడం, డ్రైవింగ్‌ లైసెన్సు, వాహన కాగితాలు కలిగి ఉండాలని చెబుతున్నారు. సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ, మద్యం తాగి వాహనాలు నడపకూడదని అంటున్నారు. కొంతమంది మంచి మాటలతో చెబితే వినరని.. ఇలాంటి చట్టాలతోనే దారికొస్తారని సమర్థిస్తున్నారు.
అదే సమయంలో ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించే వారూ లేకపోలేదు. ఈ రేంజ్ లో ఫైన్లు పెంచేస్తే తమ పరిస్థితి ఏంటని వాపోతున్నారు. ఆస్తులు అమ్ముకోవాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పుల పాలు కావాల్సిందే అని వాపోతున్నారు. కొత్త మోటారు వాహనాల చట్టం వాహనదారులను బెంబేలెత్తిస్తోంది. వారికి నిద్ర లేకుండా చేస్తోంది. ఇటీవల గుర్గావ్ లో ట్రాఫిక్ పోలీసులు ఓ బైకిస్ట్ కి ఏకంగా రూ.23వేలు ఫైన్ వేశారు. ఒక బండికి రూ.23వేలు ఫైన్ వేయడం ఏంటని అంతా ఆశ్చర్యపోయారు. ఇంత ఫైన్ ఎలా వచ్చిందంటే.. అతడు 5 నిబంధనలను ఉల్లంఘించాడు. అవి ఏమేమంటే..
1. బండికి పొల్యూషన్ సర్టిఫికెట్ లేదు : రూ.10వేలు ఫైన్
2. డ్రైవింగ్ లైసెన్స్ లేదు : రూ.5వేలు ఫైన్
3. బండికి ఆర్సీ లేదు : రూ.5వేలు ఫైన్
4. ఇన్సూరెన్స్ లేదు : రూ.2వేలు ఫైన్
5. హెల్మెట్ పెట్టుకోలేదు : రూ.వెయ్యి ఫైన్

 

జరిమానాకు సంబంధించిన చలాన్‌ను చూసిన బైకిస్ట్ షాక్ అయ్యాడు. ఆ వ్యక్తి ఆ బైక్ ని సెకండ్ హ్యాండ్‌లో రూ.15వేలకు కొన్నాడు. ఫైన్ చూస్తే రూ.23వేలు. దీంతో అతగాడు.. ఫైన్ కట్టకుండా తన టూ వీలర్ ని అక్కడే వదిలి వెళ్లిపోయాడట. ఆ రూ.23వేల వేలుతో మరో సెకండ్ హ్యాండ్ బండ్ కొనొచ్చని అతగాడు భావించాడట. ఇదొక్కటే కాదు.. ఇలాంటి కేసులు చాలానే నమోదయ్యాయి. బండి ఖరీదు కన్నా వేసిన ఫైన్ల విలువే ఎక్కువగా ఉంది. దీంతో కొత్త చట్టంపై వాహనదారులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇదేం చట్టంరా బాబూ అని సీరియస్ అవుతున్నారు. దేశవ్యాప్తంగా చాలా చోట్ల ట్రాఫిక్ పోలీసులు, వాహనదారుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అంతేసి ఫైన్లు వేస్తే ఎలా అని ట్రాఫిక్ పోలీసులతో ఘర్షణకు దిగుతున్నారు వాహనదారులు. మాకేం సంబంధం లేదు.. రూల్స్ ని ఫాలో అవుతున్నాము అని పోలీసులు చెబుతున్నా.. వాహనదారులు మాత్రం వినిపించుకోవడం లేదు.

 

ఇక రాంచీలో అయితే దారుణమే జరిగింది. ఓ ఆటో డ్రైవర్.. జరిమానాల భయంతో ట్రాఫిక్ పోలీసుని గుద్దేసి మరీ పారిపోయాడు. పట్టుబడితే ఎక్కడ ఫైన్లు వేస్తారో, ఎక్కడ ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందోనని అతడు భయపడ్డాడు. దీంతో పోలీసులు ఆపమని అడిగినా అతడు ఆగలేదు. ట్రాఫిక్ పోలీస్ ని ఆటోతో గుద్దేసి అలానే పారిపోయాడు. ఈ ఘటనలో ఆ పోలీస్ పక్కటెముకలు విరిగాయి. తృటిలో ప్రమాదం నుంచి బయటపడటంతో బతుకుజీవుడా అని ఊపిరిపీల్చుకున్నాడు.

 

వాహన చట్టాన్ని కఠినతరం చెయ్యడం కరెక్టే.. కానీ.. మరీ ఈ రేంజ్ లో ఫైన్లు పెంచడం ఎంతవరకు కరెక్ట్ అని వాహనదారులు నిలదీస్తున్నారు. రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ కోసం కృషి చెయ్యడంలో తప్పు లేదు.. కానీ మరీ ఇలా ఆస్తులు అమ్ముకునేలా పరిస్థితి తీసుకొస్తే ఎలా అని వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని సమీక్షించి కొంతలోకొంతైనా జరిమానాలు తగ్గిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.

 

కొత్త మోటారు వాహనాల చట్టం ప్రకారం..
* హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే… రూ.వెయ్యి ఫైన్ (ప్రస్తుతం రూ.100) లేదా 3 నెలల పాటు లైసెన్సు రద్దు.
* మద్యం సేవించి వాహనం నడిపితే రూ.10 వేలు (ప్రస్తుతం రూ.2 వేలు)
* సీటుబెల్టు పెట్టుకోకుండా కారునడిపితే రూ.వెయ్యి (ప్రస్తుతం రూ.100)
* డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనం నడిపితే రూ.5 వేలు (ప్రస్తుతం రూ.500)
* రాంగ్ రూట్‌లో వాహనం నడిపితే రూ.5 వేలు (ప్రస్తుతం రూ.1100)
* అతివేగంతో వాహనం నడిపితే రూ.వెయ్య లేదా రూ.2 వేలు (ప్రస్తుతం రూ.400)
* ప్రమాదకరంగా వాహనం నడిపితే రూ.5 వేలు (ప్రస్తుతం రూ.1000)
* అంబులెన్స్, ఫైర్ ఇంజిన్ వంటి అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకపోతే రూ.10 వేలు ఫైన్ (ప్రస్తుతం ఎలాంటి అపరాధం లేదు)
* వాహనానికి బీమా లేకపోతే రూ.2 వేలు (ప్రస్తుతం రూ.1000)
* పర్మిట్ లేని వాహనానికి రూ.10 వేలు (ప్రస్తుతం రూ.5000)
* త్రిబుల్ డ్రైవింగ్ చేస్తే రూ.5 వేలు (ప్రస్తుతం రూ.1200)
* సెల్‍‌ఫోన్ డ్రైవింగ్ చేస్తే రూ.5 వేలు (రూ.వెయ్యి)
* మైనర్లు డ్రైవింగ్ చేస్తే రూ.25 వేలు లేదా సంరక్షకులు లేదా యజమానికి మూడేళ్లు జైలుశిక్ష మరియు అపరాధం. ప్రస్తుతం రూ.1500 మాత్రమే వసూలు చేస్తున్నారు.

Tags : BJPfinesmodimotor vehicle actoffencepenaltyroad safetytraffic rules

Also read

Use Facebook to Comment on this PostMenu