02/10/17 2:39 PM

ఓం నమో వేంకటేశాయ – రివ్యూ

Om Namo Venkateshaya Review and Ratings, Om Namo Venkateshaya Review Staring: Nagarjuna | Anushka Shetty | Pragya Jaiswal ఓం నమో వేంకటేశాయ రివ్యూ

 

భక్తి భావాన్ని వెదజల్లే సినిమాలు పూర్తిగా కరువైపోతున్న మోడరన్ యుగంలో అలానాటి మహా భక్తుల కథలను, దేవుడి లీలలను వెండితెర ద్వారా చూపే ప్రయత్నం చేస్తున్న వాళ్ళలో దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారు మాత్రమే ముందున్నారు. మూస కథల ధోరణిలో కొట్టుకుపోతున్న నవతరం నిన్నటి తరం కథనాయకులా కాకుండా భిన్నంగా ఆలోచిస్తూ తన నట కౌశల్యానికి పరీక్ష పెట్టె పాత్రల్ని ఎంచుకుని మరీ చేస్తున్న నాగార్జున స్పూర్తిగా నిలుస్తున్నారు. ఇప్పుడు ఆ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన మరో ఆధ్యాత్మిక దైవలీల ప్రయాణమే ‘ఓం నమో వేంకటేశాయ’. భాక్తుల్లోనే కాక సినిమా ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు పెంచుకున్న ఈ సినిమా ఎలా ఉందో చూడండి.

 

కథ

బాల్యం నుంచే భగవంతుడి దర్శనం చేసుకోవాలనే బలమైన సంకల్పంతో అనుభవానంద స్వామి (సాయి కుమార్) దగ్గర శిష్యుడిగా చేరతాడు రామ (నాగార్జున). గురువు ఉపదేశం మేరకు దేవుడిని స్మరిస్తూ యుక్త వయసు వచ్చే దాకా తపస్సులో మునుగుతాడు. తీరా దేవదేవుడు (సౌరభ్ జైన్) బాలుడు రూపంలో ప్రత్యక్షమైతే గుర్తుపట్టలేక పంపించేసి తపస్సు భగ్నం అయినందుకు ఇంటిముఖం పడతాడు. భవాని (ప్రగ్యా జైస్వాల్) తో పెళ్లి కుదురుస్తారు పెద్దలు. కాని తాను భగవంతుడి అన్వేషణలో ఉన్నానని చెప్పి భవానితో వివాహం కాకుండానే తిరుమల కొండకు వచ్చేస్తాడు రామ. అక్కడ ధర్మాధికారిగా వ్యవహరిస్తున్న గోవిందరాజులు (రావు రమేశ్) అక్రమాలను రాజ గిరిధర రాయ (సంపత్ రాజ్) ముందు బయట పెట్టి అతని స్థానంలో తిరుమల కొండపై ఎన్నో సంస్కరణలకు కారణం అవుతాడు. ఇక రామా భక్తికి మెచ్చి ఏడుకొండల స్వామి అతనితో పాచికలు ఆడడానికి వస్తుంటాడు. ఆ క్రమంలో ఓసారి తన నగలన్నీ రామకు పందెంలో ఓడిపోతారు శ్రీవారు. దీంతో గుడిలో నగలన్నీ రామా ఇంట్లో ప్రత్యక్షం అవుతాయి. రామ దోషిగా నిలబడతాడు. రాజ వారు విచారణ జరిపించి రామని నిర్దోషిగా నిరూపిస్తాడు. శ్రీవారు మారు వేషంలో వచ్చి రామ గొప్పదనం అందరికి చెప్పి తనకంటే ముందు రామ దర్శనం చేసుకునేలా ప్రేరేపిస్తాడు. దీంతో హతాశుడైన రామ ఒట్టు పెట్టించుకుని మరీ ఓ వరం కోరతాడు. అదేంటో, రామకు ‘హతీరాంబాబా’ అని పేరు ఎందుకు వచ్చిందో, ఈ కథకు కృష్ణమ్మ (అనుష్క) కు ఉన్న సంబంధం ఏంటో తెరపై చూడాల్సిందే.

 

నటీనటులు

అక్కినేని నాగార్జున నిన్నటి తరం నటుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని పదిలపరుచుకునే క్రమంలో చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు ఈ సినిమా ఒక ఎత్తు అని చెప్పక తప్పదు. అద్భుతమైన నటనతో నిజమైన భక్తిని కళ్ళలో ఒలికిస్తూ నాగ్ చూపించిన నటనకు వారెవ్వా నాగ్ అనాల్సిందే. జీవించాడు అనే మాట చిన్నదే అవుతుంది. కథను కథనాన్ని జీర్ణం చేసుకుంటే తప్ప ఇంత బాగా పండించలేరు. నాగార్జున కెరీర్ బెస్ట్ మూవీగా చెప్పొచ్చు. వసూళ్లు ఎంత వస్తాయి అనవసరం. నాగ్ మాత్రం దిబెస్ట్ అనిపించాడు. క్లైమాక్స్ లో మీకు కన్నీరు రాకపోతే మీరు సినిమా ఆస్వాదించలేదు అని ఖరాఖండిగా చెప్పొచ్చు. అంత బాగా చేసారు. అక్కడక్కడ స్క్రిప్ట్ డిమాండ్ చేసినట్టు కాస్త మాస్ టచ్ ఇవ్వాలని చూసినా నాగార్జున మాత్రం ఎక్కడ బాలన్స్ తప్పకుండ తనకు మాత్రమే ఇది సాధ్యం అని మరోసారి ఛాలెంజ్ చేసి మరీ ప్రూవ్ చేసాడు. ఇలాంటి భక్తి రస పాత్రలు నాగార్జున తప్ప ఎవరు చేయలేరు అని చిరంజీవి నిన్న అన్న మాట ముమ్మాటికి నిజం. ఇక కృష్ణమ్మగా అనుష్క ఇందులో గెస్ట్ రోల్ కాదు. సినిమా చివరి దాకా ఉంటుంది. ఏడుకొండల వాడి మహా భక్తురాలిగా చక్కని నటన ఇచ్చింది. బాగా బొద్దుగా ఉన్నా సరే గ్లామర్ అవసరం లేదు కాబట్టి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది. ప్రగ్యా జైస్వాల్ కేవలం పది నిమిషాల పాత్ర అంతే. ఓ పాట ఐదు సీన్లు. చెప్పడానికి ఏమి లేదు. గోవింద రాజులుగా విలన్ పాత్రలో రావు రమేష్ ఎప్పటిలాగే చెలరేగాడు. రాజు గా సంపత్ రాజ్ ఎంత చేయాలో అంతే చేసాడు. కమర్షియల్ సినిమాల్లో అప్పుడప్పుడు ఓవర్ యాక్షన్ చేసే సంపత్ ఇందులో డీసెంట్ గా ఉన్నాడు. ఇక జగపతిబాబు అనవసరం ఈ సినిమాలో. కృష్ణమ్మా మీద మనసుపడి భంగపడిన పాత్ర సినిమా నిడివి కోసం ఇరికించినట్టు అనిపిస్తుంది. వెన్నెల కిషోర్, రఘు బాబు, బ్రహ్మానందం, సనా, పృథ్వి, విమల రామన్ ఇలా వాళ్ళ వాళ్ళ రోల్స్ కి తగ్గట్టు అతికినట్టు సరిపోయారు.

 

నాగార్జునతో సమానంగా ప్రస్తావించాల్సిన మరో నటుడు సౌరభ్ జైన్. తెలుగు వాడు కాకపోయినా ఏడుకొండల స్వామిగా పరకాయ ప్రవేశం చేసాడు. మంచి అందగాడైన సౌరభ్ నటన పరంగా కూడా చాలా చక్కగా చేసాడు. పాచికలు ఆడే సమయంలో, క్లైమాక్స్ లో తన భక్తుడి కోరికను ఇష్టం లేకపోయినా తీర్చాల్సి వచ్చిన ఘట్టంలో, ఇద్దరు భార్యల అలక తీరుస్తూ వాళ్ళ సందేహ నివృత్తి చేసే సీన్స్ లో మహాబాగా నటించాడు. ‘అన్నమయ్య’లో సుమన్ కన్నా సౌరభ్ చాలా బాగున్నాడు అని చూసాక ఎవరైనా ఒప్పుకుని తీరతారు. ఈ విషయంలో రాఘవేంద్రరావు టాలెంట్ ని మెచ్చుకోవాల్సిందే. శ్రీహరి రూపం ఎంత ముగ్ధమనోహరంగా ఉంటుందో అని ఊహించుకునేవాళ్ళకు ధీటైన సమాధానంగా నిలిచాడు సౌరభ్ జైన్. టీవీ నటుడైనా ఏ మాత్రం బెరుకు లేకుండా మొదటి తెలుగు సినిమాలోనే ఇంతగొప్ప అవకాశం దక్కించుకోవడం అతని అదృష్టం, శ్రీనివాసుడి కృపా కటాక్షం.

 

సాంకేతిక వర్గం

వందకిపైగా సినిమాలు తీసి అటు క్లాసుని ఇటు మాస్ ని ఒకేసారి మెప్పించగలిగిన దర్శక ధీశాలి రాఘవేంద్రరావు గారి గురించి విశ్లేషణ చేసేంత సాహసం చేయలేం కాని ఓ రెండు మాటలు చెప్పాలి. ‘అన్నమయ్య’, ‘శ్రీ రామదాసు’ సినిమాలు ఇచ్చిన గొప్ప అనుభూతి తర్వాత తీసిన ‘పాండురంగడు’, ‘షిరిడి సాయి’ ఇవ్వలేదు అనే విమర్శ మోసిన రాఘవేంద్రుడు దీంతో దాన్ని పూర్తిగా తుడిచేసుకున్నారు. ఇంకా చెప్పాలంటే ఆ నాలుగు సినిమాల కన్నా ఇది మీరుగా ఉంది. కథను చెప్పిన విధానం ఎక్కడ విసుగు రాకుండా భక్తిలోని టెంపో తగ్గకుండా రాసుకున్న కథనం చూస్తే ఈ తరం దర్శకులకు ఆయనతో క్లాసులు చెప్పించాలి అనిపిస్తుంది. ఇంత ముదిమి వయసులోనూ ఆయనకు స్క్రిప్ట్ మీద టేకింగ్ మీద ఉన్న కమాండ్ కి జోహార్ అనే మాట సరిపోదు. కాని మంచి విందు భోజనంలో చిన్న రాయిలా అసలు అవసరమే లేని రెండు డ్యూయెట్లని ఇరికించడం మాత్రం ఇబ్బంది పెడుతుంది. ఫస్ట్ హాఫ్ లో నాగార్జున, ప్రగ్యా జైస్వాల్ డ్యూయెట్, సెకండ్ హాఫ్ లో జగపతి బాబు, అనుష్కల డ్యూయెట్ రెండు అడ్డమే. ఎడిటింగ్ లో తీసేస్తే ఇంకా మంచి ఫీల్ వస్తుంది. ఇక సినిమాకి నెక్స్ట్ హీరో కీరవాణి. నేపధ్య సంగీతంతో సాక్షాత్తు కొండ మీద తిరుగుతున్న ఫీలింగ్ కలిగించాడు తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో. ఇందులో ఆయనతో పాటు కెమెరామెన్ గోపాల్ రెడ్డి పాత్ర కూడా ఎంతో ఉంది. సినిమా ఎక్కడ కూడా అసహజంగా అనిపించకపోవడానికి కారణం ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ పనితనం ప్రతి ఫ్రేంలో ఔరా అనిపిస్తుంది. నిర్మాతలు మహేష్ రెడ్డి తన జీవితంలో గర్వంగా చెప్పుకునే సినిమా తీసారు. తిరుమల దర్శనానికి వెళ్ళినపుడు వెయిటింగ్ రూమ్స్ లో ప్రదర్శించడానికి ఇది బెస్ట్ ఛాయస్ గా మారినా ఆశ్చర్యం లేదు. రచయిత భారవి ఇందులో ఎన్నో విషయాలు శోదించి రాసినట్టు అనిపిస్తుంది. సేవలకు సంబందించిన చరిత్ర, తిరుమల కొండపై మార్పులు ఎలా వచ్చాయి, ముందు వరాహస్వామిని ఎందుకు దర్శించుకోవాలి అనే వివరాలు బాగున్నాయి.

 

బహు బాగున్నవి

నాగార్జున అద్వితీయమైన నటన

కీరవాణి సంగీతం

రాఘవేంద్రుడి దర్శక మాయాజాలం

గోపాల్ రెడ్డి చాయాగ్రహణం

ఆర్ట్ డైరెక్షన్

 

తేడాగా అనిపించినవి

రెండు యుగళ గీతాలు

శ్రీవారి సిరిగా విమలా రామన్ అంతగా నప్పలేదు

 

చివరిగా ఓ మాట

‘ఓం నమో వేంకటేశాయ’ ఈ మధ్య కాలంలోనే కాదు ఈ దశాబ్దంలోనే ఉత్తమ భక్తి చిత్రం అనడానికి అదనంగా ఎటువంటి ఉపమానం అక్కర్లేదు. టెక్నాలజీ వెంట పరుగులు పెడుతూ దేవుణ్ణి మొక్కడానికి కూడా టైంలేని నేటి యువతరానికి చూపించాల్సిన సినిమా ఇది. ఏది మితిమీరకుండా అన్ని తగుపాళ్ళలో అరటి ఆకులో వడ్డించిన భక్తి పూరిత షడ్రసోపేత విందు భోజనం ‘ఓం నమో వేంకటేశాయ’. దైవ చింతన పావలా భాగం ఉన్నా మిస్ కాకుండా చూడాల్సిన సినిమా. అందుకే రికమండ్ చేయడానికి సంకోచించడం లేదు. నాగార్జున నటనతో కట్టి పడేస్తే దర్శకేంద్రుడు తన దర్శకత్వంతో దేవదేవుడికి చేతులు జోడించేలా చేస్తారు .

 

రేటింగ్ : 3 .75/5

 

Om Namo Venkateshaya Review and Ratings

 

 

—జిఆర్ఎన్

Tags : Anushka ShettyMovie ReviewNagarjuna AkkinenuOm namo venkateshayaOm Namo Venkateshaya Review and RatingsPragya Jaiswalఓం నమో వేంకటేశాయ రివ్యూ

Also read

Use Facebook to Comment on this PostMenu