01/15/16 1:03 PM

సోగ్గాడే చిన్ని నాయనా- రివ్యూ

Soggade Chinni Nayana Review, Nagarjuna | Ramya Krishna | Lavanya Tripathi | Anushka | Anasuya, Soggade Chinni Nayana Review and Ratings, Movie Review

కల్యాణ్ కృష్ణ దర్శకత్వం లో నాగార్జున హీరోగా  నటించి, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై  నిర్మించిన సోగ్గాడే చిన్నినాయనా ఎలా ఉందంటే..?

 

కథ

బంగార్రాజు (నాగార్జున) ఒక జమీందార్, మంచి సరసుడు, మంచి మనసున్నోడు, బోలెడన్ని సెట్ అప్ లు ఉన్నా భార్య సత్య (రమ్యకృష్ణ) అంటే విపరీతమైన ప్రేమ. సత్య గర్భవతిగా ఉన్నప్పుడే బంగార్రాజు యాక్సిడెంట్ లో చనిపోతాడు. చనిపోయిన బంగార్రాజు నరకానికి వెళ్తాడు. అక్కడ యముడు (నాగబాబు), బంగార్రాజు నడిపిన వివాహేతర సంబంధాల కారణంగా అతనికి ఆడ యమ భటులతో శిక్షలు వేస్తాడు. అయితే బంగార్రాజు ఆడ యమభటులను కూడా ముగ్గులోకి దించుతుంటాడు. ఇక బంగార్రాజు, సత్యల కొడుకు పేరు రాము (నాగార్జున). అతను అమెరికాలో పెద్ద డాక్టర్. భార్య సీత (లావణ్య త్రిపాఠి). తన భర్త లాగా, తన కొడుక్కి కూడా లేడీస్ వీక్ నెస్ రాకూడదని, సత్య రాముని ఆడగాలి తగలకుండా పెంచుతుంది. తల్లి పెంపకంలో కొడుకు ముద్దూమురిపెం అంటే తెలియకుండా ముద్దపప్పులా పెరుగుతాడు. తండ్రి ఊళ్ళో ఉన్న ఆడవాళ్లందరినీ గెలికే టైప్ అయితే, కొడుకు మాత్రం భార్యని కూడా టచ్ చేయని టైప్. రాముతో వేగలేక సీత విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుని, ఇద్దరూ కలిసి ఇండియాకి వస్తారు. కొడుకు కాపురాన్ని సరిదిద్దడం కోసం బంగార్రాజు ఆత్మ భూమి మీదకి వస్తుంది. కొడుకు కాపురాన్ని దిద్దే పనిలో ఉన్న బంగార్రాజుకి తనది యాక్సిడెంట్ కాదు, హత్య అని తెలుస్తుంది. ఆ హత్య ఎవరు చేయించారు? ఎందుకు చేయించారు? హత్య చేసిన వారిని బంగార్రాజు ఎలా శిక్షించాడు, కొడుకు కాపురాన్ని ఎలా సరిదిద్దాడు అన్నదే మిగతా స్టోరీ.

 

ఎలా తీసారు?

ఇది నాగార్జునకి పర్ఫెక్ట్ గా, ఇంకా చెప్పాలంటే నాగర్జునకి మాత్రమే సరిపోయే పాత్ర. ఈ కథకి నాగార్జునని ఒప్పించడంతోనే దర్శకుడు సగం సక్సెస్ అయ్యాడు. ఇక గోదావరి జిల్లాల అందాల మధ్య సినిమా హాయిగా సాగిపోయేలా సత్యానంద్ మంచి స్క్రీన్-ప్లే ఇచ్చారు. రమ్యకృష్ణ నాగార్జునకి పర్ఫెక్ట్ జోడిగా, అటు అందంలోను, ఇటు నటనలోనూ మంచి మార్కులు కొట్టేసింది. విలన్ గా సంపత్, నాజర్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, పోసాని, ఝాన్సీ, ఎల్.బి.శ్రీరామ్ లు తమ పాత్రలకి న్యాయం చేసారు.

 

ఒక వైపు కొత్త దంపతుల మధ్య ఉండే అపోహాలు, అపార్థాలు, బంగార్రాజు సాగించిన సరసాల మధ్య సినిమా నడుపుతూ, సడెన్ గా క్రైం యాంగిల్ లోకి తీసుకెళ్ళారు. ఇంటర్వెల్ కి ముందు సినిమా మరీ సాగదీస్తున్నాడు అని అనిపించే సరికే కథనంలో కాస్త స్పీడ్ పెంచి ఇంటర్వెల్ వచ్చేస్తుంది. ఇంటర్వెల్ తర్వాత స్టొరీ కాస్త ఊపందుకునే సమయంలో అనవసరంగా అనసూయ, హంసానందిని, కృష్ణకుమారిగా అనుష్క వచ్చి సినిమా ఫ్లోని దెబ్బ కొడతారు. ఫ్యామిలి ఆడియెన్స్ కి ఇబ్బంది అవుతుందని అనసూయ, హంసానందినిలతో స్కిన్ షో చేయించడానికి దర్శకుడు వెనుకాడాడు. అటు స్కిన్ షో లేకుండా, ఇటు కథకి సంబంధం లేకుండా ఈ క్యారెక్టర్స్ వేస్ట్ అయ్యాయి. ప్రేక్షకులకి మళ్ళీ బోర్ కొడుతుంది అనే టైంలో కథని పట్టాలెక్కించి క్లైమాక్స్ కి తీసుకెళతాడు. మధ్యలో ఆత్మానందం అనే దొంగ స్వామీజీగా బ్రహ్మానందం కామెడి పరవాలేదని పిస్తుంది. క్లైమాక్స్ రొటీన్ గానే ఉన్నా, టేకింగ్ లో వేగం వల్ల బోర్ కొట్టదు.

 

సాంకేతికంగా చూస్తే

అనూప్ రూబెన్స్ ఇచ్చినవాటిలో రెండు పాటలు బాగున్నాయి. పి.ఎస్. వినోద్ సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ ఓకే. మూలకథ అందించిన పి.రామ్మోహన్ మంచి మార్కులు కొట్టేసాడు.

ఒక్కమాటలో చెప్పాలంటే: పండగ సినిమా.

(జబర్ దస్త్ టీవీ షో ఫ్యామిలీతో కలిసి చూసే వారికి, ఇది కూడా ఫ్యామిలీ తో చూడదగ్గ సినిమానే.)

 

 

అంకెల్లో చెప్పాలంటే: 3/5

Tags : anasuyaAnushka ShettyHamsa NandiniLavanya TripathiMovie Reviewnagarjunaramya krishnaRatingREVIEWsoggade chinni nayanaSoggade Chinni Nayana review

Also read

Use Facebook to Comment on this PostMenu