03/14/18 2:22 PM

దేవుడు ఉన్నాడా? లేడా? చర్చిద్దాం రండి

Tribute to Stephen Hawking

ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఇంగ్లాండ్ లోని కేంబ్రిడ్జ్ లో ఈరోజు కన్నుమూసారు. 21 ఏళ్ల వయసుకే నాడీమండల వ్యాధితో చక్రాల కుర్చీకే పరిమితం అయిన, యాభై ఐదేళ్లుగా అనేక పరిశోధనలు చేస్తూ, మానవాళి కి ఎంతో సేవ చేసారు. ముఖ్యంగా ఖగోళ శాస్త్రంపై ఆయన చేసిన పరిశోధనలు, ఆయన ప్రతిపాదించిన సిధ్దాంతాలు భవిష్యత్తుతరాలకి ఎంతో ఉపయోగపడనున్నాయి. దేవుడి ఉనికికి ఆధారాలు లేవు అని చెప్పిన స్టీఫెన్ హాకింగ్, గ్రహాంతర వాసులు మాత్రం ఉండొచ్చు అని, వారు మనకన్నా సాంకేతికంగా ఎన్నో రెట్లు అభివృద్ధి చెంది ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసారు. స్టీఫెన్ హాకింగ్ కు నివాళిగా కొన్ని ప్రశ్నలని కొరడా.కాం మీ ముందు ఉంచుతోంది.

 

ఈ ప్రశ్నలు లేవనెత్తడానికి ఒక కారణం ఉంది, కొంతమంది హేతువాదులు, నాస్తికవాదులు, వాదాల స్థాయి దాటి తమది ఒక ప్రత్యేక మతం లాగా వ్యవహరిస్తున్నారు.  “నా దగ్గర ఒక కొలబద్ద ఉంది ఆ కొలబద్ద ప్రకారం నున్వు చెప్పే దాన్ని నిరూపించు, లేదా తప్పు అని ఒప్పుకో” అనే స్థాయిలో ఈ హేతు, నాస్తికవాదుల వాదన ఉంటోంది. దేవుడి ఉనికి గురించిన వాదనే తీసుకోండి.. “దేవుడు ఉన్నాడని అంటున్నారుగా, ఎక్కడ ఉన్నారో చూపించండి లేదంటే దేవుడు లేడని ఒప్పుకోండి” ఇలా సాగుతుంది వీరి వాదన. దేవుడు ఉన్నాడనేది ఎలా ఒక నమ్మకమో, లేడు అనేది కూడా ఒక నమ్మకమే. నిజం ఏమిటంటే..”ప్రస్తుతం శాస్త్రవేత్తలకి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, దేవుడు ఉన్నాడు అనేందుకు తగిన ఆధారాలు లేవు” ఇదీ ఈనాటి వాస్తవం.  ఎలాగైతే స్టీఫెన్ హాకింగ్ గ్రహాంతర వాసులు ఉండొచ్చు అని నమ్మారో, అలాగే కొంతమంది దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నారు. ఈ అనంత విశ్వంలో కోటాను కోట్ల నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలలో  మనకి తెలిసింది, మనం కాలుమోపగలిగింది ఒక్క చంద్రుడి మీదనే. కాబట్టి మన దగ్గర ఉన్న సమాచారం అతి స్వల్పం. ఈ కొద్ది సమాచారంతో, అంతా మాకే తెలుసు, మాకు కనబడనిది, మా కొలబద్దతో కొలవడానికి వీలుకానిది అంతా ట్రాష్ అని కొట్టిపడేయడం కరెక్టేనా?

 

ఉదాహరణకి, ఓ ఇరవై ఏళ్ల తర్వాత ఎవరో ఒక శాస్త్రవేత్త, దేవుడు ఉన్నాడు , సృష్టికర్త ఉన్నాడు అని రుజువు చేయొచ్చు కదా. ఫలానా గ్రహం మీదో, ఇంకెక్కడో ఏదో ఒక శక్తి ఉంది, ఆ శక్తి మానవుడి మస్తిష్కాన్ని కూడా ప్రభావితం చేయగలుగుతుంది.  ఈ భూమి మీద ఉన్న వాళ్ళంతా ఆయన ఆడుకుంటున్న ఆటలో భాగం అని రుజువు చేయకూడదు అని ఏమైనా ఉందా? మనం ఎలాగయితే హ్యూమనాయిడ్ రోబోట్ లని తయారుచేసి వాటితో మనకి కావాల్సిన పనులు చేయించుకుంటున్నామో,  అలాగే ఇంకెవరో, ఇంకెక్కడి నుంచో  మనుషులతో కూడా ఆడుకుంటుండవచ్చు కదా.  అలా ఆడుకుంటున్నాడు అనే దానికి ప్రస్తుతానికి ఆధారాలు లేవు, ఆడుకోవట్లేదు అనేదానికి ఆధారాలు లేవు.

 

చాగంటి కోటేశ్వర రావు ఇలా మాట్లాడాలి, దానికి బాబు గోగినేని ఇలా సమాధానం ఇవ్వాలి, హేతువాద సంఘం అధ్యక్షుడు నార్నే వెంకట సుబ్బయ్య దాన్ని ఇలా ప్రచారం చేయాలి, జనవిజ్ఞాన వేదిక బ్రహ్మారెడ్డి ఇంకోలా చెప్పాలి అనేది సృష్టికర్త స్క్రిప్ట్ లో భాగమేనేమో. ఎందుకు కాకూడదు? ఈ వాదన కరెక్ట్ అయితే, అన్నీ దేవుడే చేయిస్తుంటే మనుషులు చేసే తప్పులకి మనుషులది బాధ్యత కాదు కదా దేవుడిదే కదా, అలాంటప్పుడు ఈ చట్టాలు ఎందుకు, కోర్టులు ఎందుకు అనే ప్రతివాదన వస్తుంది. కోర్టులు చట్టాలు కూడా సృష్టికర్త ఆటలో భాగమేనేమో?

 

పసుపు యాంటిబయాటిక్ గా పనిచేస్తుంది అని కనుక్కున్నది ఈ మధ్యే కావచ్చు, పసుపు లో ఆ లక్షణాలు అది పుట్టినప్పటినుంచి ఉన్నాయి. గురుత్వాకర్షణ ని న్యూటన్ కనిపెట్టి ఉండవచ్చు, ఆయన కనిపెట్టక ముందు కూడా యాపిల్ పండు చెట్టుమీదనుంచి కిందకే పడింది, పైకి వెళ్ళలేదు.

 

మనకి తెలిసిందే జ్ఞానం, మిగతాది అంతా అజ్ఞానం అనుకోవడమే పెద్ద అజ్ఞానం.  మనకి తెలిసింది గోరంత, తెలియాల్సింది కొండంత అని ఒప్పుకుని, ఆ కొండని తెలుసుకునే ప్రయత్నం చేయడమే, స్టీఫెన్ హాకింగ్ కు మనం ఇచ్చే నివాళి.

ఈ ఆర్టికల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలుపగలరు.

-నరేష్ శిరమని 

Tags : AliensPresence of GodrationalistRELIGIONTribute to Stephen HawkingTruth about God

Also read

Use Facebook to Comment on this PostMenu