03/18/18 5:42 AM

ఉగాది ఊరించి చెప్పే ఊసులెన్నో!

ఉగాది శుభాకాంక్షలు

 

 

ఆదాయం రెండు వ్యయం పన్నెండు…రాజపూజ్యం ఆరు అవమానం పదహారు. భలే గమ్మత్తుగా…ఇంకా చెప్పాలంటే రసవత్తరంగా ఉంటాయి ఈ గణాంకాలు…ప్రతి ఒక్కరూ ప్రతి ఉగాది నాడు మిగిలిన విషయాలు పక్కన పెట్టి…ఈ సంవత్సరం మనకెలా ఉంటుంది…అని బేరీజు వేసుకుని “హమ్మయ్య ఈ ఏడాది మనకి అదిరింది” అని అనుకోవడం రివాజు.

 

నేటికి… నిన్న భూత కాలం…రేపు భవిష్యత్త్‌ కాలం…గడిచేదే వర్తమానం…అందరికీ తెలిసిన విషయమే. అయితే త్రికాలాలో గతం గడిచిపోయింది కాబట్టి అది ఎప్పుడూ బాగానే ఉంటుంది. వర్తమానం ఎలాగూ గడవాలి ఎలాగాలో నడవాలి కాబట్టి సరిపెట్టుకోక తప్పదు… అయితే భవిష్యత్త్ గురించే అందరికీ  ఆసక్తి…కుతూహలం.

 

మన భారతీయత లో ఉన్న అద్భుతం ఆశావాహ ధృక్పధం…దానికి ఒక దారిచూపించి, అందరికీ మార్గ నిర్దేశం చేసే పండుగ ఉగాది. ఉగాది అంటే ఎన్నో నిర్వచనాలు. నిగూఢ రహస్యాలు చెప్పొచ్చు, అయితే అవన్ని సామాన్యులకు అనవసరం.

 

ఏడో ఇంటి కుజుడు,మూడో ఇంట గురుడు,భాగ్యాధిపతి రవి, ఇలా చెప్పుకుంటే పోతే అవన్నీ అయోమయంగానే తోస్తాయి. ఫలానా పార్టీ అధికారంలోకి వస్తుంది, ఫలాన దేశంలో సునామీ వస్తుంది, తీవ్రవాదం పెరుగుతుంది,రోడ్లు నెత్తురోడుతాయి, ఇవన్నీ తెలుసుకోడానికి అయితే పర్వాలేదు, కానీ తెలుసుకుని మాత్రం ఏం చేయగలం?

 

వీటికతీతంగా మన బ్రతుకుబండి ఎలా సాగుతుంది? ఎన్ని మలుపులు తిరుగుతుంది? కొత్త పుంతలు తొక్కుతుందా? జీవితం సంతృప్తిగా సాగుతుందా? మన కుటుంబం సంతోషంగా ఉంటుందా? అనుకోని ఆపద ఏం రాదుకదా? భగవంతుడు మనల్ని చల్లగా చూస్తాడా?నవగ్రహాలు నానా రకాలుగా తిప్పలు పెట్టవు కదా! గ్రహాలు ఆగ్రహించకుండా అనుగ్రహిస్తే అంతకన్నా ఏం కావాలి…ఇలా సాగుతాయి సగటు మనిషి ఆలోచనలు.

 

ఉగాది నాడు దినపత్రికలలో వచ్చే రాశిఫలాలు, టెలివిజన్లలో చెప్పే పంచాంగ శ్రవణాలు హృద్యంగా ఉంటాయి, సందేహం లేదు. ఒకవేళ ఫలితాలు ప్రతికూలంగా ఉంటే కుమిలిపోయి దుఃఖించ నవసరంలేదు, ఆ ఫలితాలన్నీ ఒకరకంగా పంచాంగ కర్త ప్రతిభాపాటవాల బట్టి మారుతూ ఉంటాయి.

 

భవిష్యత్త్‌ కు సంబంధించి మనం మాట్లాడుకునే ఏ అంశమైనా కూడా వాస్తవంలోకి వచ్చే వరకు ఊహాగానమే. అదీ గాక ఉగాది నాడు చర్చించుకునే రాశిఫలాలన్ని జనబాహుళ్యం మొత్తనికి వర్తిస్తాయి. వ్యక్తిగత ఫలితాలు వేరుగా గణించాలి. కాబట్టి హంసలా మంచిని తీసుకుని చెడుని వదిలి పెట్టడం ఎంతైనా అవసరం.

 

ఏదైనా సరే మనకు మార్గ నిర్దేశం చేయగలదే గానీ మన నడకను నిర్దేశించలేదు. మన విజయాన్ని శాసించలేదు. ఈ సత్యాన్ని మనం విడవకూడదు. మన సంకల్పాన్ని వదలకూడదు. అందుకే ఊరించే ఉగాది పచ్చడి తింటూ,ఊహల ఊయలలో ఊగుతూ,ఉగాది చెప్పే ఊసులన్నీ విందాం…ఊకొడదాం…

                                                               – పరమహంస

Tags : predictionsSREE VILAMBI UGADItelugu new yearUGADI

Also read

Use Facebook to Comment on this PostMenu