07/10/19 10:09 PM

కథ ముగిసింది : వరల్డ్ కప్ నుంచి భారత్ ఔట్

What Is The Reason For India Defeat In World Cup

కథ ముగిసింది. పోరాటానికి తెరపడింది. అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. వరల్డ్ కప్ 2019 నుంచి టీమిండియా ఔట్ అయ్యింది. కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్ లోనే భారత జట్టు పోరాటం ముగిసింది. న్యూజిలాండ్ చేతిలో కోహ్లి సేన పోరాడి ఓడింది. 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ వరల్డ్ కప్ మనదే అని అభిమానులు కన్న కలలు కల్లలయ్యాయి. లీగ్ దశలో టీమిండియా జోరు చూసి సంబరపడ్డ అభిమానులకు.. ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. అసలైన మ్యాచ్ లో మనోళ్లు చేతులెత్తేశారు. బౌలర్లు అద్భుతంగా రాణించినా బ్యాట్స్ మెన్ విఫలం అయ్యారు. టార్గెట్ పెద్దది కాకపోయినా.. ఛేదించలేక చతికిలపడ్డారు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. 240 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు.. విజయానికి 18 పరుగుల దూరంలో ఆగిపోయింది. 221 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ పరాజయంతో వరల్డ్ కప్ 2019 టోర్నీ నుంచి ఔట్ అయ్యింది.

 

భారత జట్టు పరాజయానికి కారణం ఏంటి? టీమిండియా ఓడిపోవడానికి కారణం ఎవరు? ఎవరిని తప్పు పట్టాలి? ఎవరిని నిందించాలి? అనేది ప్రశ్నించుకుంటే.. కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్టు భారత జట్టు ఓటమికి కూడా చాలానే కారణాలు ఉన్నాయి. అందులో తొలి కారణం వాతావరణం, రెండో కారణం పిచ్. మూడోది మనోళ్ల పూర్ ఫెర్ఫార్మెన్స్. వాతావరణం భారత జట్టు విజయావకాశాలను బాగా దెబ్బకొట్టింది. తొలి రోజు వర్షం కారణంగా ఆట నిలిచిపోయిన సంగతి తెలిసిందే. రెండో రోజు పిచ్ స్వభావం దారుణంగా మారింది. బౌలర్లకు పూర్తిగా అనుకూలించింది. దీంతో కివీస్ పేసర్లు చెలరేగిపోయారు. మనోళ్లకు చుక్కలు చూపించారు. కివీస్ బౌలర్లను ఎదుర్కోలేక మన బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు.

 

రోహిత్, శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, దినేశ్ కార్తిక్.. అంతా ప్రపంచ అగ్రశ్రేణి బ్యాట్స్ మెన్లే. కానీ కీలక సమయంలో చేతులెత్తేశారు. ఈ టోర్నమెంట్ లో ఏకంగా 5 సెంచరీలు బాదిన రోహిత్ శర్మ.. దారుణంగా విఫలమయ్యాడు. అతడే కాదు. కేఎల్ రాహుల్, కెప్టెన్ విరాట్ కోహ్లి, యంగ్ గన్ రిషబ్ పంత్ కూడా అదే తీరు. టాప్ ఆర్డర్ విఫలం కావడంతో భారత జట్టు ఓడిపోయింది. టార్గెట్ పెద్దదేమీ కాదు. ఈజీగా కొట్టేయచ్చు. కానీ మనోళ్లు తేలిపోయారు. కేవలం 5 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకుంది. ఓపెనర్ రోహిత్ శర్మ (1)తో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ (1) కూడా సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా 1 పరుగుకే అవుటయ్యాడు.

 

కివీస్ బౌలర్లు పిచ్ ను సద్వినియోగం చేసుకుని రెచ్చిపోయిన వేళ 240 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ 49.3 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. భారత ఆటగాళ్లు ఎంతో సునాయాసంగా ఫైనల్ చేరతారనుకుంటే అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చారు. 18 పరుగుల తేడాతో భారత్ ను ఓడించిన కివీస్ ప్రపంచకప్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. అంతకుముందు భారత్… జడేజా, ధోనీ క్రీజులో ఉన్నంతసేపు గెలిచేలా కనిపించింది. జడేజా 77 పరుగులు సాధించి అవుటైన తర్వాత, ధోనీ బ్యాట్ ఝుళిపిస్తాడని, జట్టును గెలిపిస్తాడని అందరూ ఆశించారు. వారి అంచనాలకు తగ్గట్టే ఓ భారీ సిక్స్ తో తన ధాటి మొదలుపెట్టిన ధోనీ ఆ తర్వాత దురదృష్టం వెంటాడడంతో రనౌట్ గా వెనుదిరిగాడు.

 

ఇక, చాహల్, బుమ్రా జోడీ చివరి ఓవర్ ను కాచుకోగా, అప్పటికి భారత్ విజయానికి 6 బంతుల్లో 23 పరుగులు చేయాల్సి ఉంది. కానీ చాహల్ అవుట్ కావడంతో ఇన్నింగ్స్ కు తెరపడింది. కివీస్ బౌలర్లలో హెన్రీకి 3, బౌల్ట్, శాంట్నర్ లకు చెరో 2 వికెట్లు లభించాయి. ఆదిలోనే భారత్ ఇన్నింగ్స్ ను దారుణంగా దెబ్బతీసిన పేసర్ హెన్రీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది.

 

కచ్చితంగా ఇది బ్యాట్స్ మెన్ వైఫల్యమే అని అభిమానులు అంటున్నారు. కీలక సమయంలో బాధ్యతగా ఆడాల్సిన వాళ్లు నిర్లక్ష్యంగా ఆడి వికెట్లు పొగొట్టుకున్నారు. అఫ్ఘనిస్థాన్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లతో సునాయసంగా నెగ్గిన భారత జట్టు.. అసలైన ప్రత్యర్థితో జరిగిన మ్యాచ్ లో మాత్రం చేతులెత్తేసింది. కివీస్ జట్టు మాత్రం అన్ని విభాగాల్లో సత్తా చాటింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్… ఇలా అన్ని విభాగాల్లో దుమ్ముదులిపింది. అందుకే విజేతగా నిలిచింది. టోర్నీలో 5 సెంచరీలు బాదిన రోహిత్ శర్మ కూడా భారత జట్టుని కాపాడలేకపోయాడు. ఛేజింగ్ కింగ్ పేరున్న విరాట్ కోహ్లి సైతం రాణించలేకపోయాడు.

 

కేన్ విలియమ్సన్ నాయకత్వంలోని కివీస్ టీమ్ అన్ని రంగాల్లో బలంగా ఉన్న టీమిండియాను అనూహ్యరీతిలో ఓడించి వరల్డ్ కప్ ఫైనల్లోకి దూసుకెళ్లడం విశేషం. ఓ దశలో టోర్నమెంట్ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టాల్సి ఉన్నా, మెరుగైన రన్ రేట్ తో పాకిస్థాన్ ను వెనక్కినెట్టి సెమీఫైనల్ బెర్తు ఖాయం చేసుకుంది కివీస్. అలాంటి జట్టు..చివరికి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత్ నే ఇంటికి పంపడాన్ని భారత జట్టు అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.

 

లీగ్ లో వరుస విజయాలతో సత్తా చాటిన భారత జట్టు..అసలైన పోరులో చతికలపడిపోయింది. ఒకరకంగా చెప్పాలంటే.. చేతులారా భారత్ మ్యాచ్ ఓడిపోయింది. విజయానికి భారత ఆటగాళ్లు అర్హులు కారని అభిమానులు అంటున్నారు. భారత బౌలర్లను ఎదుర్కొని కివీస్ సీనియర్ ప్లేయర్లు విలియమ్ సన్, రాస్ టేలర్.. అద్భుతంగా బ్యాటింగ్ చేసి జట్టుకి గౌరవప్రదమైన స్కోర్ అందించారు. కానీ మన జట్టులో మాత్రమే అలాంటి ప్లేయర్లే కనిపించకపోవడం బాధాకరం. మొత్తంగా.. లీగ్ దశలో భారత జట్టు ప్లేయర్ల ఆటతీరు చూసి ఈ వరల్డ్ కప్ మనదే అని అభిమానులు గట్టిగా నమ్మారు. కానీ వారి అంచనాలు తప్పాయి. బలమైన ప్రత్యర్థిపై గెలిచినప్పుడే మన సత్తా ఏంటో తెలుస్తుంది. ఆ విషయంలో టీమిండియా మరోసారి విఫలమైందని అభిమానులు అంటున్నారు. ఆటలో గెలుపోటములు సహజమే అని అందరికి తెలుసు. కానీ చేతులారా ఓడిపోవడం అనేదాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Tags : beatCRICKET.Indiamanchesternewzealandrohit sharmateam indiavirat kohliworld cup 2019

Also read

Use Facebook to Comment on this PostMenu