09/8/17 3:00 PM

రివ్యూ: యుద్ధం శరణం

yuddham sharanam review

నటీనటులు: నాగ చైతన్య, లావణ్య త్రిపాఠి, రావు రమేష్, రేవతి, శ్రీకాంత్ తదితరులు

సంగీతం: వివేక్ సాగర్

సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మిరెడ్డి

ఎడిటింగ్: కృపాకరన్

నిర్మాత: సాయి కొర్రపాటి, రజిని కొర్రపాటి

దర్శకత్వం: కృష్ణ మారిముత్తు

 

ఎక్కువగా ప్రేమ కథా చిత్రాలను ఎన్నుకునే నాగచైతన్య ఈ మధ్య విభిన్న కథలను ఎన్నుకుంటూ యాక్షన్ హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన నటించిన తాజాగా చిత్రం ‘యుద్ధం శరణం’. ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. ఈ శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆడియన్స్ ను ఎంతవరకు ఆకట్టుకుందో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!

కథ : 

నాయక్(శ్రీకాంత్) అనే రౌడీ సిటీలో బాంబు పేలుళ్లు జరుపుతాడు. ఈ పేలుళ్లకు కారణమైన వారిని పట్టుకోమని పోలీసులు శాస్త్రి(మురళీశర్మ) అనే ఆఫీసర్ ను నియమిస్తారు. మరోపక్క అర్జున్(నాగచైతన్య) అనే కుర్రాడు తన కుటుంబంతో కలిసి జీవిస్తుంటాడు. డ్రోన్ ను తయారు చేయడం అర్జున్ పని. దానిలో సక్సెస్ కావడానికి ప్రయత్నిస్తుంటాడు. అర్జున్ తల్లితండ్రులు వైద్యులు కావడంతో సేవా సంస్థను ఏర్పాటు చేసి ప్రజలకు ఉచిత సేవలు అందిస్తుంటారు. వారి దగ్గరకు ట్రైనీగా వచ్చిన అంజలి(లావణ్య త్రిపాఠి)ని చూసి ప్రేమిస్తాడు అర్జున్. తన ప్రేమను తల్లితండ్రులకు చెప్పి ఒప్పించాలనుకుంటాడు. అయితే ఇంతలో గుడికి అని బయలుదేరిన తన తల్లితండ్రులు కనిపించకుండా పోతారు. వారిని వెతకడానికి బయలుదేరిన అర్జున్ కి శవాలుగా కనిపిస్తారు. యాక్సిడెంట్ కారణంగా ఇద్దరూ చనిపోయారని పోలీసులు చెబుతారు. కానీ వారిని కావాలనే చంపారనే విషయం అర్జున్ కి తెలుస్తుంది. ఇంతకీ వారిని చంపింది ఎవరు..? వారిపై అర్జున్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు..? వీరి చావుకి నాయక్ కు ఏమైనా సంబంధం ఉందా..? అనే విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే!

విశ్లేషణ: 

ఓ పాతిక ఏళ్ల కుర్రాడి జీవితంలో ఎదురైన సంఘర్షణను అతడు ఎలా ఎదిరించి నిలిచాడనే పాయింట్ తో ఈ సినిమాను రూపొందించారు. తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని హీరో ఎదిరించడం చివరకు విలన్ ను చంపేయడం.. చాలా సినిమాల్లో చూసేసాం. యుద్ధం శరణం లో కూడా ఇదే చూపించారు. అయితే ఇక్కడ హీరో తన తెలివితేటలతో ప్రతీకారాన్ని తీర్చుకుంటాడు. ఒక సస్పెన్స్ ఎలిమెంట్ తో సినిమాను మొత్తం దర్శకుడు నడిపించిన తీరు ప్రశంసనీయం. కథ రొటీనే అయినా.. దర్శకుడు దానిపై కూడా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలిగించిన తీరుని మెచ్చుకోవాల్సిందే.

సినిమా మొదటిభాగం మొత్తం లవ్ స్టోరీ రెండు పాటలు, ఫ్యామిలీ సన్నివేశాలతో గడిచిపోతుంది. సెకండ్ హాఫ్ మొత్తం కూడా ప్రతీకార నేపధ్యంలో సాగుతుంది. తన కుటుంబం కోసం ఓ కుర్రాడు పడే తాపత్రయం కదిలిస్తుంది. సినిమాలో కథ కంటే కథనంపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. చెడుని ఎదిరించడం కోసం మనం చెడ్డవారిగా మారాల్సిన అవసరం లేదని దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ మెచ్చుకోదగిన విధంగా ఉంది. క్లైమాక్స్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.

నాగచైతన్య తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. తనే సొంతంగా చేసిన స్టంట్స్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. పక్కింటి కుర్రాడిగా కనిపిస్తూనే తనకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించే యువకుడిగా తన పాత్రలో ఇమిడిపోయాడు. లావణ్య త్రిపాఠి గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో ఆమె గ్లామర్ తగ్గినట్లుగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో ఆమె పాత్ర కూడా పెద్దగా ఏం ఉండదు. రావు రమేష్, చైతు మధ్య వచ్చే సంభాషణలు ఆకట్టుకుంటాయి. రేవతి తల్లి పాత్రలో ఒదిగిపోయింది. విలన్ గా శ్రీకాంత్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. అయితే ఆ పాత్రను మరింత బలంగా తీర్చిదిద్ది ఉంటే బాగుండేది. కేవలం అతడి లుక్స్ మీదే ఫోకస్ పెట్టినట్లుగా అనిపిస్తుంది. అయితే ఈ సినిమాతో ఇండస్ట్రీకు మరో మంచి విలన్ దొరికాడనే చెప్పాలి. ప్రియదర్శి, కిరీటి వంటి నటులను పెట్టుకున్నప్పుడు కామెడీకు కాస్త ఆస్కారం ఉంటుందని భావిస్తాం. కానీ ఈ సినిమాలో వినోదం లోపించింది.

కెమెరా పనితనం ఆకట్టుకుంది. నైట్ విజన్ కెమెరా ఉపయోగించి చిత్రీకరించిన సన్నివేశాలను ఇది వరకు తెలుగు సినిమాల్లో చూసి ఉండం. వివేక్ సాగర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. పాటలు కూడా వినసొంపుగా ఉన్నాయి. ఎడిటింగ్ వర్క్, నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడికి ఇది మొదటి సినిమానే అయినా.. ఆ ఫీలింగ్ ఏ ఒక్క ఫ్రేమ్ లో కూడా కలగదు. ఎంతో పరిణితి చెందిన దర్శకుడిగా ఈ సినిమాను చిత్రీకరించారు. అయితే రొటీన్ కథ కావడం కాస్త అసహనానికి గురి చేస్తుంది. కానీ తన కథనంతో ప్రేక్షకులను బాగానే ఎంటర్టైన్ చేశాడు.

 

ఫైనల్ గా చెప్పాలంటే.. రొటీనే అయినా.. మెప్పిస్తుంది. 

రేటింగ్: 2.75/5  

 

Tags : chaituLavanya TripathiNaga Chaitanya AkkineniYuddham Sharanam Movie Review and Rating

Also read

Use Facebook to Comment on this PostMenu